KTR: 'ఢిల్లీ చెప్పులు మోసే గులాములను తెలంగాణ రాష్ట్రం గమనిస్తోంది' అంటూ వీడియో షేర్ చేసిన కేటీఆర్

KTR shares video of Bandi Sanjay giving chappals to Amit Shah
  • నిన్న సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా
  • అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందిస్తున్నట్టుగా ఉన్న వీడియో వైరల్
  • రాష్ట్ర ఆత్మగౌరవాన్ని నిలపడానికి సబ్బండ వర్ణం సిద్ధంగా ఉందన్న కేటీఆర్
నిన్న తెలంగాణ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. మునుగోడు బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అనంతరం నిన్న రాత్రి శంషాబాద్ లోని నొవోటెల్ లో ఆయన బీజేపీ కీలక నేతలతో భేటీ అయ్యారు. మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కూడా అమిత్ షా భేటీ అయ్యారు. 

ఇంకోవైపు నిన్న హైదరాబాద్ చేరుకున్న తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం దేవాలయం వెలుపల అమిత్ షాకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పులు అందిస్తున్నట్టుగా ఉన్న ఒక వీడియో వైరల్ అవుతోంది. 

ఈ వీడియోను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను... ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుడ్ని తెలంగాణ రాష్ట్రం గమనిస్తోందని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి కొట్టి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు బండి సంజయ్ పై టీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. పదవుల కోసం మరీ ఇంతగా దిగజారాలా? అని ప్రశ్నిస్తున్నాయి.
KTR
TRS
Bandi Sanjay
Amit Shah
BJP

More Telugu News