Junior NTR: ఆర్‌ఆర్‌ఆర్‌ లో నటన భేష్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌ ను ప్రశంసించిన అమిత్‌ షా.. కలిసి భోజనం చేసిన ప్రముఖులు

  • హైదరాబాద్‌ లోని నోవాటెల్‌ హోటల్‌ లో ప్రత్యేకంగా భేటీ
  • ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో కలిసిన ప్రముఖులు
  • ట్వీట్ చేసిన అమిత్ షా 
Junior NTR meets Amithsha

తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో టాలీవుడ్‌ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మునుగోడులో బీజేపీ బహిరంగ సభ అనంతరం షా హైదరాబాద్‌ లోని నోవాటెల్‌ హోటల్‌‌కు చేరుకున్నారు. గత రాత్రి 10.30 గంటల సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా హోటల్‌‌కు వెళ్లారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్‌ ను అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు. ఎన్టీఆర్‌కు అమిత్ షా పుష్పగుచ్ఛంతో స్వాగతం పలకగా.. ఎన్టీఆర్ ఆయనను శాలువాతో సత్కరించారు. వీరి మధ్య ఆ తర్వాత దాదాపు 45 నిమిషాలపాటు సమావేశం జరగ్గా అందులో 20 నిమిషాల పాటు షా, ఎన్టీఆర్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అనంతరం అమిత్‌ షా, కిషన్‌రెడ్డి, తరుణ్‌ఛుగ్, బండి సంజయ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసి భోజనం చేశారు.

బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీలో అమిత్ షా సీనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన నటించిన విశ్వామిత్ర, దానవీరశూర కర్ణ వంటి సినిమాలు తాను చూశానని చెప్పారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారులు బాగా పనిచేసేవారన్నారు. అనంతరం షా ఓ ట్వీట్ చేస్తూ.. ‘‘అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, మన తెలుగు సినిమా తారకరత్నం జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది’’ అని ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు.


భేటీపై సర్వత్ర చర్చ
అమిత్ షా-ఎన్టీఆర్ భేటీపై రాజకీయ వర్గాల్లో విపరీత చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనను ప్రశంసించేందుకే షా ఆయనతో భేటీ అయ్యారని బీజేపీ చెబుతున్నా.. అలాగైతే మరి రాంచరణ్‌, దర్శకుడు రాజమౌళిని ఎందుకు పిలవలేదని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ వెనక కూడా రాజకీయ కోణం ఉండొచ్చని చెబుతున్నారు.

More Telugu News