Anurag Thakur: జగన్ పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు

  • యువతను జగన్ అన్ని విధాలుగా మోసం చేశారు
  • ఉన్న పరిశ్రమలు కూడా పోయేలా జగన్ పాలన ఉంది
  • 21 లక్షల ఇళ్లను కేంద్రం ఇచ్చినా.. వాటిని పేదలకు జగన్ ఇవ్వలేదు
Anurag Thakur fires in Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈరోజు విజయవాడలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబు ను వ్యతిరేకించి జగన్ ను రాష్ట్ర యువత గెలిపించారని... అలాంటి యువతను జగన్ అన్ని విధాలా మోసం చేశారని మండిపడ్డారు. అందుకు జగన్ కు బుద్ధి చెప్పడానికి ఏపీ యువత ఇప్పుడు సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయేలా జగన్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.  

మా జాబు ఏది అంటూ గతంలో చంద్రబాబును ప్రశ్నించిన యువత... ఇప్పుడు జగన్ ను కూడా అదే విషయంపై ప్రశ్నిస్తోందని అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలు నడిపిస్తున్నాయని చెప్పారు. ఏపీలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని... అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాఫియాల ఆట కట్టిస్తామని అన్నారు. లిక్కర్ మాఫియాతో ఏపీ ప్రభుత్వానికి లింక్ ఉందని చెప్పారు. అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని... దీని వల్ల యువత ఆరోగ్యం పాడవుతోందని చెప్పారు. గంజాయి ముఠాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో అత్యంత అవినీతి రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో ఉన్నాయని చెప్పారు. జగన్, కేసీఆర్ లు అవినీతిలో నెంబర్ వన్ స్థానం కోసం పోరాడుతున్నారని దుయ్యబట్టారు. 

ఏపీలో నీటి కుళాయిల కోసం కేంద్రం రూ. 4,500 కోట్లు ఇస్తే... జగన్ ఆ నిధులను మళ్లించి... కేవలం రూ.  4 కోట్లు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ప్రాంతానికి చెందినవారే అయినప్పటికీ... ఆ ప్రాంతం నుంచి ఇప్పటికీ ప్రజలు ఉపాధి కోసం వలస పోతున్నారని చెప్పారు. ఏపీకి మూడు ఇండస్ట్రియల్ కారిడార్ లను ప్రధాని మోదీ ఇచ్చారని... కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారని... ఈ విషయాన్ని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. 

ఏపీకి మోదీ 21 లక్షల ఇళ్లను కేటాయించినా.. ఇంతవరకు పేదలకు వాటిని జగన్ అప్పగించలేదని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. కడపలోనే ప్రజల సమస్యలను జగన్ పట్టించుకోవడం లేదని... అలాంటప్పుడు ప్రజల సమస్యలను ఎలా పట్టించుకుంటారని అన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఒక్క రాజధాని అమరావతికే డబ్బు లేనప్పుడు మూడు రాజధానులను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. పెట్రోల్ పై పన్నుల భారాన్ని కూడా జగన్ తగ్గించలేదని... జగన్ కు జీఎస్టీ కంటే జేఎస్టీ (జగన్ ట్యాక్స్) పైనే ఎక్కువ ఆసక్తి అని అన్నారు. మోదీ పథకాలకు జగన్ ఆయన స్టిక్కర్లు వేసుకుంటున్నారని చెప్పారు.

More Telugu News