RTI: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుమార్తె ఇవాంక పర్యటనకు భారత ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఇదీ..!

RTI reveals how much government spent on donald trumps india visit
  • 2020 ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడి హోదాలో పర్యటించిన ట్రంప్
  • ఆయన వెంట వచ్చిన కుమార్తె ఇవాంక, అల్లుడు జేరడ్ కుష్నర్
  • వారి 36 గంటల పర్యటనకు అయిన ఖర్చు సుమారు రూ.38 లక్షలేనన్న కేంద్ర ప్రభుత్వం
  • సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు సమాధానంగా వెల్లడి
ఎవరైనా నాయకుడు ఏదైనా ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు రోడ్ల వెంట ఫ్లెక్సీల నుంచి సభలు, రోడ్ షోలకు జన సమీకరణ దాకా ఎంతో హడావుడి కనిపిస్తుంది. ఇక పోలీసు భద్రత, ఏర్పాట్లు, నాయకులకు, వారి వెంట వచ్చినవారికి బస, ఆహారం, ప్రయాణ ఖర్చులు.. ఇలా ఎన్నో ఉంటాయి. అందులోనూ వచ్చే వీఐపీలను బట్టి ఈ ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు అమెరికా అధ్యక్షుడు, ఆయన కుటుంబం పర్యటిస్తే.. ఎంత ఖర్చయి ఉంటుంది? దీనిపై మిషల్ భతేనా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద చేసుకున్న దరఖాస్తుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా సమాధానం ఇచ్చింది. 

ఢిల్లీ, ఆగ్రా, అహ్మదాబాద్ లో పర్యటన
2020 ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుమార్తె ఇవాంక, ఆమె భర్త జేరడ్ కుష్నర్ భారత పర్యటనకు వచ్చారు. ఢిల్లీ, ఆగ్రాలలో పర్యటించారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ‘నమస్తే ట్రంప్’ పేరిట జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్నారు. మొత్తం 36 గంటల పాటు వారు పర్యటించారు. ఈ సమయంలో భారీ అట్టహాసంతో కార్యక్రమాలను నిర్వహించారు. మీడియాలో విపరీతమైన పబ్లిసిటీ జరిగింది. 

ఈ నేపథ్యంలో ట్రంప్ పర్యటనకు సంబంధించి భారత ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంతో చెప్పాలంటూ మిషల్ భతేనా అనే వ్యక్తి అదే ఏడాది అక్టోబర్ లో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో స్థాయిలో సమాచారం నిరాకరించడం, అప్పీల్ చేయడం.. ఇలా కొనసాగుతూ.. ఎట్టకేలకు కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ దానికి సమాధానం ఇచ్చారు.

“2020 ఫిబ్రవరి 24–25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనలో బస, ఆహారం, రవాణా ఖర్చులు కలిపి సుమారు రూ.38 లక్షలు ఖర్చయింది. విదేశాల అధ్యక్షులు వచ్చినప్పుడు అనుసరించాల్సిన నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయడం జరిగింది. కోవిడ్ కారణంగా వివరాలు అందించడంలో జాప్యం జరిగినట్టు విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. దానిపై సంతృప్తి చెందాం..” అని ప్రధాన సమాచార కమిషనర్ వైకే సిన్హా తన సమాధానంలో పేర్కొన్నారు.

RTI
USA
Donald Trump
India
Central Government

More Telugu News