Madhavan: 'లాల్ సింగ్ చడ్డా' ఫ్లాప్ కావడం.. 'రాకెట్రీ' హిట్ కావడంపై మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • కరోనా తర్వాత ఆడియన్స్ లో చాలా మార్పు వచ్చింది
  • ఒకే ఇండస్ట్రీ సినిమాలను మాత్రమే కాకుండా.. అన్ని సినిమాలు చూస్తున్నారు
  • మనకు నచ్చిన సినిమాలు తీస్తే వర్కౌట్ కాదు
  • థియేటర్లకు జనాలు వచ్చేలా స్క్రీన్ ప్లేను పక్కాగా తయారు చేసుకోవాలి
  • స్టార్ హీరో ఉన్నంత మాత్రాన సినిమా ఆడదు
Madhavan comments on Laal Singh Chadda flop and Rocketry hit

భారీ అంచనాలతో వచ్చిన బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చిత్రం 'లాల్ సింగ్ చడ్డా' డిజాస్టర్ గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథతో మాధవన్ నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన 'రాకెట్రీ' సినిమా విజయవంతమైంది. ఈ నేపథ్యంలో 'లాల్ సింగ్ చడ్డా' ఫ్లాప్ కావడం... 'రాకెట్రీ' హిట్ కావడంపై మాధవన్ స్పందించారు. 

ప్రతి ఒక్కరూ హిట్ అవుతుందనే ఉద్దేశంతోనే సినిమాను నిర్మిస్తారని మాధవన్ చెప్పారు. ఒక ఫెయిల్యూర్ సినిమాను తీయబోతున్నామనే భావనతో ఎవరూ సినిమా తీయరని అన్నారు. అన్ని సినిమాలకు కష్టపడిన విధంగానే 'లాల్ సింగ్ చడ్డా'కు కూడా కష్టపడ్డారని చెప్పారు. ప్రేక్షకులు ఇప్పుడు ప్రపంచ సినిమా స్థాయికి వెళ్లిపోయారని తెలిపారు. 

తన సినిమా 'రాకెట్రీ' విషయానికి వస్తే, ఇదొక బయోపిక్ అని... ఇలాంటి సినిమాలు ఎప్పుడైనా ఆడతాయని చెప్పారు. కరోనాకు ముందులా ఇప్పుడు ఆడియన్స్ లేరని... వారిలో సమూలమైన మార్పు వచ్చేసిందని అన్నారు. థియేటర్లలో సినిమాలు ఆడేలా స్క్రీన్ ప్లేను పక్కాగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

సినిమా బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వస్తారని మాధవన్ అన్నారు. దక్షిణాది సినిమాల గురించి మాట్లాడితే... బాహుబలి 1, బాహుబలి 2, కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు హిందీ స్టార్ల సినిమాల కంటే బాగా ఆడాయని చెప్పారు. కరోనాకు ముందు ప్రేక్షకులు ఒక ఇండస్ట్రీకి చెందిన సినిమాలను మాత్రమే చూస్తుండేవారని... కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సినిమాలను చూసేందుకు అలవాటు పడ్డారని తెలిపారు. 

అందువల్ల వారికి నచ్చే సినిమాను చేస్తేనే ఆ సినిమా ఆడుతుందని... మనకు నచ్చిన విధంగా సినిమా తీస్తే ప్రేక్షకులు చూడరని అన్నారు. స్టార్ హీరో ఉన్నంత మాత్రాన సినిమా ఆడుతుందనే రోజులు పోయాయని చెప్పారు. ప్రేక్షకులకు తగ్గట్టుగా మనం కూడా మారాలని అన్నారు.

More Telugu News