Arvind Kejriwal: 2024 లోక్​సభ ఎన్నికలే లక్ష్యంగా.. కేజ్రీవాల్​ జాతీయ స్థాయి ప్రచారం

Arvind Kejriwal Launches  Make India Number 1 campaign For 2024 Election
  • ‘మేక్ ఇండియా నంబర్ వన్’ కార్యక్రమం ప్రారంభించిన ఢిల్లీ సీఎం
  • పంచ సూత్రాలతో ప్రజల మధ్యకు వెళ్లనున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత
  • అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఇందులో పాల్గొనవచ్చన్న అరవింద్
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ ఈసారి కేంద్రంలో అధికారంపై కన్నేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ‘మేక్ ఇండియా నంబర్ వన్’ పేరిట జాతీయస్థాయి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జాతీయ జెండా ఊపి ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. దేశంలోని అన్ని పార్టీలు, ప్రజలు ఇందులో పాల్గొనవచ్చని పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరికీ ఉచిత విద్య, ఆరోగ్య సదుపాయాలు, యువతకు ఉపాధి, మహిళలకు సమాన అవకాశాలు, రైతులకు మద్దతు ధర కల్పించాలన్న ఐదు లక్ష్యాలతో ఈ మిషన్ ను ప్రారంభించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. 

‘ఎంత డబ్బు ఖర్చయినా దేశంలోని ప్రతి బిడ్డ చదువుకునేలా చేయడమే మన ప్రథమ కర్తవ్యం. రెండవది ప్రతి పౌరుడికి మెరుగైన, ఉచిత వైద్యం అందేలా చూడటం. దేశంలోని ప్రతి మూలలో పాఠశాలలు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లు మొదలైన వాటిని నెలకొల్పాలి. ఈ దేశంలో ఏ యువకుడూ నిరుద్యోగిగా ఉండకూడదు. అలాగే, ఈ దేశంలో ప్రతి మహిళను గౌరవించాలి, సమాన హక్కులు, భద్రత పొందాలి. ఐదవది, ఈ దేశంలోని రైతులకు మద్దతు ధర కల్పించాలి. ఈ ఐదు లక్ష్యాలను సాధిస్తే భారతదేశం ప్రపంచంలోనే నంబర్ 1 గా మారడాన్ని ఎవరూ ఆపలేరు’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

ఈ మిషన్ రాజకీయాలకు అతీతమని చెప్పారు. తాను దేశమంతటా పర్యటించి ఇందులో ప్రజలను కూడా భాగం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Arvind Kejriwal
AAP
Make India Number 1
Lok Sabha
2024 elections

More Telugu News