Somu Veerraju: కేంద్రం ఇస్తున్న నిధులను కూడా సొంత ఖాతా నుంచి ఇస్తున్నట్టు బటన్ నొక్కుతున్నారు: సోము వీర్రాజు

  • బటన్ నొక్కడమే పనిగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందన్న వీర్రాజు 
  • మూడేళ్లయినా రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి శూన్యమంటూ వ్యాఖ్య  
  • రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని విమర్శ  
YSRCP govt is doing nothing except pressing buttons says Somu Veerraju

ఏపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. బటన్ నొక్కడమే పనిగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా సొంత ఖాతా నుంచి ఇస్తున్నట్టుగా బటన్ నొక్కుతున్నారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి శూన్యమని అన్నారు. జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమయిందని అన్నారు. వైసీపీ బుర్రలేని ప్రభుత్వంలా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.

విజయవాడలోని నేచర్ క్యూర్ ఆసుపత్రికి గత ప్రభుత్వం భూమిని ఇచ్చిందని... ఆ భూమిని వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పేరుతో నిర్వీర్యం చేసిందని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం 35 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే... ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఏపీకి రాజధాని లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 21న విజయవాడలో భారీ బహిరంగసభను నిర్వహించబోతున్నామని తెలిపారు. ఆ సభలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని చెప్పారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News