Team India: జింబాబ్వే పర్యటనకు దూరమైన భారత ఆల్ రౌండర్

Indian all rounder Washington Sundar ruled out of Zimbabwe series due to injury
  • గాయంతో టూర్ కు దూరంగా ఉన్న వాషింగ్టన్ సుందర్
  • ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీలో ఆడుతుండగా భుజానికి గాయం
  • జింబాబ్వే వెళ్లకుండా బెంగళూరు ఎన్సీఏకు రానున్న సుందర్
జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ కు ముందు భారత జట్టు కీలక ఆటగాడి సేవలు కోల్పోయింది. గాయం కారణంగా  స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్‌ సుందర్‌  ఈ పర్యటనకు దూరమయ్యాడు. ఐపీఎల్ లో అయిన గాయం నుంచి కోలుకున్న సుందర్ ప్రస్తుతం ఇంగ్లండ్‌ దేశవాళీ వన్డే టోర్నీ రాయల్‌ లండన్‌ కప్‌లో లాంకషైర్‌ తరఫున ఆడుతున్నాడు. అయితే, ఈ నెల 10న వోర్సస్టర్‌ షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్‌ పట్టేందుకు డైవ్‌ చేసినపుడు అతని ఎడమ భుజానికి గాయమైంది. తర్వాత మళ్లీ గ్రౌండ్‌లోకి దిగలేదు. అలాగే, ఆదివారం హాంప్‌ షైర్‌తో జరిగిన మ్యాచ్ కు కూడా అతను దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతని గాయం తీవ్రమైందని తెలుస్తోంది. 

దాంతో, తను జింబాబ్వే పర్యటనకు వెళ్లలేదని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ‘అవును, వాషింగ్టన్ సుందర్ జింబాబ్వే సిరీస్‌కు దూరమయ్యాడు. అతని ఎడమ భుజానికి గాయమైంది. అతను నేషనల్‌ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందవలసి ఉంటుంది’ అని చెప్పారు. ఈ నేపథ్యంలో సుందర్ జింబాబ్వే వెళ్లకుండా నేరుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి రానున్నాడు. సుందర్ చివరగా ఫిబ్రవరిలో జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగాడు. తాజా గాయం కారణంగా అతని పునరాగమనం మరింత ఆలస్యం కానుంది. 

మరోవైపు మూడు వన్డేల సిరీస్ కోసం లోకేశ్ రాహుల్ నాయకత్వంలోని భారత జట్టు ఇప్పటికే జింబాబ్వే చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఈ నెల 18, 20, 22వ తేదీత్లో హరారే వేదికగా భారత్, జింబాబ్వే మధ్య మూడు వన్డేలు జరుగుతాయి.
Team India
all rounder
Washington Sundar
injury
ruled out
Zimbabwe
tour

More Telugu News