Telangana: బోనాలకు రమ్మంటే రాలేదని మనస్తాపం.. భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడుతూనే భర్త ఆత్మహత్య

Man suicide while calling with wife in Telangana
  • హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో ఘటన
  • ఎన్ని ఫోన్లు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపం
  • దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య
  • పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి, కాపాడమన్న భార్య 
  • భార్య ఇంటికి వచ్చేసరికే భర్త మృతి
తన బంధువుల ఇంట్లో బోనాల పండుగకు వెళ్దామని పిలిచినా రాలేదని భార్యపై అలిగిన భర్త ఆమెతో వీడియో కాల్‌లో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజవర్గంలోని పహాడీషరీఫ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. 

పోలీసుల కథనం ప్రకారం.. తుక్కుగూడకు చెందిన సాయి కార్తీక్ గౌడ్ (33) భార్య రవళితో కలిసి ఈనెల 12న ఆమె బంధువుల ఇంట్లో జరిగే వివాహం కోసం కందుకూరు మండలంలోని బేగంపేట వెళ్లాడు. అనంతరం భార్యను అక్కడే వదిలి శనివారం ఇంటికొచ్చాడు. మీర్‌పేటలో నిన్న బోనాలు జరిగాయి. ఈ సందర్భంగా అక్కడ బోనాలు పండుగ చేసుకుంటున్న తన పిన్ని ఇంటికి వెళ్దామని, వెంటనే రావాలని భార్యకు ఫోన్ చేశాడు.

ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన కార్తీక్ భార్యకు వీడియో కాల్ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. మీ తరపు వారి అన్ని ఫంక్షన్లకు వస్తున్నా, మా వాళ్ల ఫంక్షన్లకు ఎందుకు రావడం లేదని నిలదీస్తూనే దూలానికి ఉరివేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన రవళి పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి తన భర్తను కాపాడాలని వేడుకుంటూ ఇంటికి బయలుదేరింది. ఆమె ఇంటికి చేరుకునే సరికే కార్తీక్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Telangana
Hyderabad
Crime News

More Telugu News