Vista Dome: సికింద్రాబాద్-పూణే శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలులో విస్టా డోమ్ బోగీ ఏర్పాటు... చార్జీ రూ.2,110

  • సికింద్రాబాద్- పూణే శతాబ్ది ఎక్స్ ప్రెస్ పునరుద్ధరణ
  • ఈ నెల 10 నుంచి రాకపోకలు
  • విస్టా డోమ్ రూపంలో రైలుకు అదనపు హంగు
  • విస్టా డోమ్ బోగీకి ప్రయాణికుల ఆదరణ
Vista Dome coach in Secunderabad to Pune Shatabdi Express

కరోనా మహమ్మారి సృష్టించిన విలయం నుంచి కోలుకున్న భారత్ లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో రద్దు చేసిన రైళ్లను రైల్వే శాఖ క్రమంగా పునరుద్ధరిస్తోంది. తాజాగా నెంబరు 12026/12025 సికింద్రాబాద్-పూణే-సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలును ఈ నెల 10వ తేదీ నుంచి ఇరువైపులా పునరుద్ధరించారు. కాగా, ఈ ఎక్స్ ప్రెస్ రైలుకు అదనపు హంగును జోడించారు. ప్రకృతి అందాలను వీక్షిస్తూ ప్రయాణించే వారి కోసం కొత్తగా విస్టా డోమ్ బోగీని ఏర్పాటు చేశారు. 

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విస్టా డోమ్ ను కలిగివున్న మొదటి రైలు సికింద్రాబాద్-పూణే శతాబ్ది ఎక్స్ ప్రెస్. ఈ విస్టా డోమ్ బోగీలో ప్రయాణానికి సికింద్రాబాద్ నుంచి పూణేకి ఒక్కొక్కరికి చార్జీ రూ.2,110 గా నిర్ణయించారు. విస్టా డోమ్ బోగీకి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. 

ఈ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి రాత్రి 11.10 గంటలకు పూణే చేరుకుంటుంది. అటు పూణేలో ఉదయం 6 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మంగళవారం మినహా వారంలో అన్ని రోజులు ఈ రైలు నడుస్తుంది.

More Telugu News