Pakistan: పాకిస్థాన్ అమ్మాయి.. హైదరాబాద్ అబ్బాయి.. ఆన్ లైన్ లో ప్రేమ.. ఇండియా వస్తూ సరిహద్దుల్లో దొరికిపోయిన యువతి!

Pakistani woman attempts to cross border for hyderabadi lover
  • పాకిస్థాన్ నుంచి దుబాయ్ మీదుగా నేపాల్ కు చేరుకున్న యువతి
  • అక్కడి నుంచి ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నం
  • సరిహద్దుల్లో పట్టుకున్న రక్షణ బలగాలు.. పోలీసులకు అప్పగింత
ఆమె పేరు కలీజా నూర్.. పాకిస్థాన్ లోని ఫైసలాబాద్.. అతడి పేరు అహ్మద్.. తెలంగాణలోని హైదరాబాద్.. ఇద్దరూ ఆన్ లైన్ లో ఒకరికొకరు పరిచయమయ్యారు. మెల్లగా మాటలు కలిసి, ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకుని కలిసి జీవించాలనుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించకపోవడంతో.. కలీజా నూర్ పాకిస్థాన్ నుంచి ఇండియా వచ్చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ లోని ఆమె ప్రియుడు అహ్మద్ ఇందుకోసం పెద్ద ప్లానే వేశాడు.

తన సోదరుడు మహమూద్ సహకారంతో ఆమె హైదరాబాదీ అనిపించేలా నకిలీ ఆధార్ సహా ఇతర పత్రాలూ సృష్టించాడు. నేపాల్ మీదుగా ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నించాడు. కానీ భారత్–నేపాల్ సరిహద్దుల్లో బిహార్ లోని సుర్సంద్ వద్ద ఆ యువతి, అక్రమంగా ఇండియాలోకి రావడానికి సహకరిస్తున్న మరో ఇద్దరు సైన్యానికి పట్టుబడ్డారు. సైన్యం వారిని స్థానిక పోలీసులకు అప్పగించింది. ఈ మొత్తం వ్యవహారం వివరాలను సుర్సంద్  జిల్లా ఎస్పీ హర్ కిషోర్ రాయ్ మీడియాకు వెల్లడించారు.

  • హైదరాబాద్ కు చెందిన మహమూద్ అహ్మద్ కొంత కాలం సౌదీ అరేబియాలోని ఓ హోటల్ లో పనిచేశాడని.. అక్కడ పనిచేసిన నేపాల్ స్నేహితుల సాయంతో కలీజా నూర్ ను అక్రమంగా ఇండియాలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడని ఎస్పీ తెలిపారు.
  • కలీజా నూర్ కు అవసరమైన నకిలీ ఆధార్, ఇతర పత్రాలను హైదరాబాద్ లోని మహమూద్ అహ్మద్, మరికొందరు కలిసి సృష్టించారని వివరించారు.
  • కలీజా నూర్ దుబాయ్ మీదుగా నేపాల్ కు చేరుకోగా.. అక్కడి నుంచి మహమూద్ తోపాటు జీవన్ అనే వ్యక్తి ఆమెను ఇండియాలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ.. సరిహద్దుల్లో పట్టుబడ్డారని తెలిపారు.
  • తొలుత వారు గూఢచారులు కావొచ్చని భావించి ఆ దిశగా దర్యాప్తు చేశామని.. కానీ ప్రేమ వ్యవహారంతో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించినట్టు తేలిందని ఎస్పీ వివరించారు.

Pakistan
India
Social Media
Hyderabad
Pakistan Girl
Love

More Telugu News