Komatireddy Raj Gopal Reddy: ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. వెంటనే ఆమోదించిన స్పీకర్ పోచారం

Mla Rajagopal reddy resigns his post speaker accepts immediately
  • స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ అందజేసిన రాజగోపాల్
  • మునుగోడు అభివృద్ధి  కోసం రాజీనామా చేసినట్లు  వెల్లడి
  • తనకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ అవమానించారన్న రాజగోపాల్ రెడ్డి 
తెలంగాణ రాజకీయాల్లో తాజా సంచలనంగా మారిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం అసెంబ్లీలో శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేశారు. స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చిన తన రాజీనామాను పోచారం ఆమోదించినట్టు రాజగోపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు. మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేసినట్టు వెల్లడించారు. 

ఎమ్మెల్యేగా ఉన్న తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించారన్నారు. తాను పదవిలో ఉన్నప్పటికీ మునుగోడు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని బాధ పడ్డానని చెప్పారు. అందుకే పదవీ త్యాగం చేశానని వెల్లడించారు. తాను ఇప్పుడు యుద్ధం చేస్తున్నానని తన గెలుపోటములను మునుగోడు ప్రజలే నిర్ణయిస్తారన్నారు. 

మునుగోడు ఉప ఎన్నికలో వచ్చే తీర్పుతో కేసీఆర్ కుటుంబ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి లభిస్తుందన్నారు. ఇది టీఆర్ఎస్ భుత్వంపై ప్రకటించిన ధర్మ యుద్ధం అన్నారు. ఈ యుద్ధంలో ప్రజలే గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీ అయిందని ఆయన విమర్శించారు. 

టీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీల్లో ఉన్న చాలా మంది నేతలు తనతో టచ్ లో ఉన్నారని తెలిపారు. ఇక, చండూరు సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన మనుషులు మాట్లాడిన భాష విన్న తర్వాత తెలంగాణ సమాజం తల దించుకుంటోందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్ బీజేపీ అభ్యర్థిగా మునుగోడు ఉప ఎన్నికలో పోటీ పడనున్నారు.
Komatireddy Raj Gopal Reddy
mla
resigns
speaker
Pocharam Srinivas
accepts

More Telugu News