Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోప‌ణ‌లు అర్ధ ర‌హితం: నీతి ఆయోగ్‌

  • కేసీఆర్ నిర్ణ‌యం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్న నీతి ఆయోగ్‌
  • కేసీఆర్ ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని వెల్ల‌డి
  • అజెండా రూప‌క‌ల్ప‌న‌లో రాష్ట్రాల‌ను సంప్ర‌దిస్తుందని వివ‌ర‌ణ‌
niti ayog team counters to cm kcr comments on it

దేశంలోని రాష్ట్రాల‌కు కేంద్రం స‌హ‌క‌రించ‌డం లేద‌ని, నీతి ఆయోగ్ భ‌జ‌న సంస్థ‌గా మారింద‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై నీతి ఆయోగ్ చాలా వేగంగానే కాకుండా ఘాటుగా స్పందించింది. ఆదివారం జ‌ర‌గనున్న నీతి ఆయోగ్ భేటీకి హాజ‌రుకాకూడ‌ద‌ని కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. 

అజెండా రూప‌క‌ల్ప‌న‌లో రాష్ట్రాల‌ను ప‌క్క‌న‌పెట్టార‌న్న కేసీఆర్ ఆరోప‌ణ‌లు అర్ధ‌ర‌హితమ‌న్న నీతి ఆయోగ్‌.. గ‌డ‌చిన ఏడాదిలోనే సీఎంల‌తో 30 స‌మావేశాలు నిర్వ‌హించిన‌ట్లు తెలిపింది. స‌మాఖ్య స్ఫూర్తి బ‌లోపేతం కోస‌మే ఈ సంస్థ ఏర్పాటు అయిన‌ట్లు నీతి ఆయోగ్ తెలిపింది. 

అజెండా త‌యారీలో రాష్ట్రాల‌ను సంప్ర‌దించ‌డం లేద‌న్న మాట‌ల్లో వాస్త‌వం లేదని నీతి ఆయోగ్ స్ప‌ష్టం చేసింది. నీతి ఆయోగ్ ప‌నితీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోప‌ణ‌లు స‌రికాదని తెలిపింది. రాష్ట్రాల‌కు కేంద్రం అన్నిర‌కాలుగా ఆర్థిక స‌హ‌కారం అందిస్తోందని కూడా వెల్ల‌డించింది. 

కేంద్ర ప్ర‌భుత్వ ప్రాయోజిత ప‌థ‌కాల కేటాయింపులు 2015-16లో రూ.2,03,740 కోట్లు ఉండ‌గా.. 2022-23 ఏడాదికి రూ.4,42,781 కోట్లకు పెరిగిన‌ట్టు తెలిపింది. జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కింద తెలంగాణ‌కు రూ.3,982 కోట్లు కేటాయిస్తే... తెలంగాణ కేవ‌లం రూ.200 కోట్లు మాత్రమే తీసుకుందని తెలిపింది. పీఎంకేఎస్‌వై- ఏబీపీ స్కీం కింద రూ.1,195 కోట్లు విడుద‌ల చేశామ‌ని నీతి ఆయోగ్ వెల్ల‌డించింది.

More Telugu News