Telangana: కేంద్రం వైఖరికి నిరసనగా నీతి ఆయోగ్ భేటీని బ‌హిష్క‌రిస్తున్నాం: తెలంగాణ సీఎం కేసీఆర్‌

  • కేంద్రం వైఖ‌రిపై నిర‌స‌న‌కు ఇదే స‌రైన మార్గ‌మ‌న్న కేసీఆర్‌
  • కేంద్రం ఫెడ‌ర‌ల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమర్శ 
  • తెలంగాణ‌కు నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తోంద‌ని ఆరోప‌ణ‌
  • ప్ర‌ణాళికా సంఘంలో నిష్ణాతులుండేవార‌న్న‌సీఎం
  • నీతి ఆయోగ్ ఓ భ‌జ‌న మండ‌లిగా మారిపోయింద‌ని ‌కామెంట్ 
ts cm kcr says that they boycott niti ayog meeting

కేంద్రంలోని న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా ఆదివారం జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ భేటీని బ‌హిష్కరిస్తున్న‌ట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు శ‌నివారం సాయంత్రం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ నిర్ణ‌యం బాధాక‌ర‌మే అయినా కేంద్రం వైఖ‌రిని ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు తెలియ‌జెప్పేందుకు ఇదే ఉత్త‌మ మార్గ‌మ‌ని భావించామ‌ని ఆయ‌న తెలిపారు. ఇదే విష‌యాన్ని ప్ర‌ధాని మోదీకి బ‌హిరంగ లేఖ ద్వారా తెలియ‌జేశామ‌ని కూడా కేసీఆర్ చెప్పారు. 

దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చే ముందు దేశ పాల‌న‌ను ఎలా న‌డ‌పాల‌న్న దానిపై విస్తృత స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని కేసీఆర్ చెప్పారు. అందులో భాగంగానే ప్ర‌ణాళికా సంఘం ఆవిర్భ‌వించింద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌ణాళికా సంఘం ద‌గ్గ‌ర వార్షిక‌, పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక‌లు ఉండాల‌ని నాడే నిర్ణ‌యించార‌ని చెప్పారు. నెహ్రూ ప్ర‌ధాని కాగానే... ప్ర‌ణాళికా సంఘం అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని గుర్తు చేశారు. ప్ర‌ణాళికా సంఘంలో ఆయా రంగాల‌కు చెందిన నిష్ణాతులు ఉండేవార‌న్నారు. న‌రేంద్ర మోదీ ప్ర‌ధాని అయ్యాక ప్ర‌ణాళికా సంఘాన్ని ర‌ద్దు చేసి నీతి ఆయోగ్ పెట్టార‌ని ఆయ‌న అన్నారు. 

ప్ర‌ణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ వ‌చ్చిన త‌ర్వాత నిధుల కేటాయింపు, విడుద‌ల‌లో గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని కేసీఆర్ అన్నారు. 1985లో తాను తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నాడు రూ.5 ల‌క్ష‌ల ప‌నికి కూడా నిధుల విడుద‌ల‌కు ప్లానింగ్ క‌మిష‌న్ ఆమోదం ల‌భించాల్సి ఉండేద‌ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. నీతి ఆయోగ్ స‌ల‌హాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కేసీఆర్ ఆరోపించారు. ప్ర‌స్తుతం నీతి ఆయోగ్ మేథోమ‌ధ‌నాన్ని వీడి ప్ర‌ధాని మోదీ భ‌జ‌న చేస్తోంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కేంద్ర ప్ర‌భుత్వం ఫెడ‌ర‌ల్ స్ఫూర్తికి విరుద్ధంగా ప‌నిచేస్తోంద‌న్నారు. తెలంగాణ‌కు నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌ని కేసీఆర్ ఆరోపించారు.

More Telugu News