TSRTC: ఆలస్యంగా వచ్చిన బస్సు.. టీఎస్ఆర్టీసీకి జరిమానా

  • బస్సు కోసం నాలుగు గంటలపాటు వేచి చూసిన న్యాయవాది
  • ఆలస్యంపై ప్రశ్నించినందుకు దురుసుగా ప్రవర్తించిన డ్రైవర్
  • సేవల్లో లోపాన్ని గుర్తించిన వినియోగదారుల ఫోరం
  • నెలన్నర రోజుల్లో జరిమానా చెల్లించాలని ఆదేశం
Consumer Forum fined TSRTC for service failure

బస్సు ఆలస్యంగా రావడంతోపాటు గమ్యస్థానానికి కూడా ఆలస్యంగా చేరుకున్నందుకు టీఎస్ఆర్టీసీకి వినియోగదారుల ఫోరం జరిమానా విధించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఫహీమా బేగం 2019 ఆగస్టు 9న దిల్‌సుఖ్‌నగర్ నుంచి మణుగూరు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే, సాయంత్రం 7.15 గంటకు రావాల్సిన బస్సు నాలుగు గంటలు ఆలస్యంగా 11.15 గంటలకు వచ్చింది. అలాగే, ఉదయం 5.45 గంటలకు గమ్యస్థానానికి చేరుకోవాల్సిన బస్సు 9.45 గంటలకు చేరుకుంది.

బస్టాండులో నాలుగు గంటలపాటు బస్సు కోసం వేచి చూడడంతో ఫహీమా బేగం అస్వస్థతకు గురయ్యారు. బస్సు ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించినందుకు డ్రైవర్ ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆమె రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఫహీమా ఆరోపణలు నిరాధారమని ఆరోపించింది. తమ సేవల్లో లోపం లేదని వాదించింది. అయితే, సాక్ష్యాలను పరిశీలించిన వినియోగదారుల ఫోరం సేవల్లో లోపం ఉన్నట్టు గుర్తించింది. 

మణుగూరుకు బస్సు 2.20 గంటల ఆలస్యంగా చేరుకుందని నిర్ధారించింది. ఆలస్యంగా చేరుకోవడం వల్ల న్యాయవాది అస్వస్థతకు గురైన ప్రిస్క్రిప్షన్ కూడా ఉండడంతో ఆర్టీసీ సేవల్లో లోపం కారణంగానే ఆమె అస్వస్థతకు గురైందని నిర్ధారించింది. టికెట్ డబ్బు రూ. 631తోపాటు పరిహారంగా 1000 రూపాయలు, కేసు ఖర్చుల కింద మరో 500 రూపాయలను 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.

More Telugu News