Nancy Pelosi: ఆమె తైవాన్ పర్యటనకు వస్తే అమెరికా తగిన మూల్యం చెల్లించుకుంటుంది: చైనా హెచ్చరిక

  • తైవాన్ అంశంలో అమెరికా, చైనా మధ్య స్పర్ధ
  • ప్రస్తుతం ఆసియాలో పర్యటిస్తున్న నాన్సీ పెలోసీ
  • మలేసియా నుంచి తైవాన్ రానున్న వైనం
China warns US ahead of Nancy Pelosi Taiwan visit

తైవాన్ అంశంలో అమెరికా, చైనా మధ్య వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. గత కొంతకాలంగా చైనా తన యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా, అమెరికా తన భారీ యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలోకి పంపిస్తూ తైవాన్ కు అభయహస్తం అందిస్తోంది. 

కాగా, అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆసియా పర్యటనలో భాగంగా తైవాన్ ను సందర్శించనున్నారు. పెలోసీ పర్యటన నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య స్పర్ధ మరోసారి రాజుకుంది. నాన్సీ పెలోసీ తైవాన్ లో అడుగుపెడితే అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చైనా హెచ్చరించింది.

పెలోసీ ప్రస్తుతం మలేసియాలో పర్యటిస్తున్నారు. ఆసియా పర్యటనలో ఆమె రెండో గమ్యస్థానం తైవాన్ అని వార్తలు రావడంతో చైనా ఘాటుగా స్పందిస్తోంది. పెలోసీ తైవాన్ లో పర్యటిస్తే జరిగే పరిణామాలకు అమెరికానే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఇది తమ సార్వభౌమత్వ, భద్రత ప్రయోజనాలకు చెందిన అంశమని తేల్చి చెప్పింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ ఓ ప్రకటన చేశారు.

More Telugu News