sweeper: స్వీపర్ గా చేరి ఎస్బీఐ లో ఏజీఎం అయిన మహిళ!

  • ముంబైకి చెందిన ప్రతీక్ష తొండ్ వాల్కర్ సక్సెస్ స్టోరీ
  • భర్త అకాల మరణంతో ఎస్ బీఐలో స్వీపర్ ఉద్యోగం
  • రాత్రి కళాశాలలో చేరి ఇంటర్, డిగ్రీ పూర్తి
  • పరీక్షలు రాసి అధికారిగా ఎదిగిన తీరు
Meet the sweeper who rose to become an assistant general manager at SBI

క్లర్క్ గా చేరి ఉన్నతాధికారి కావడం విన్నాం. కానీ, ఓ సాధారణ మహిళ, పాఠశాల విద్య కూడా పూర్తి చేయని వ్యక్తి బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవడం అంటే.. ఆశ్చర్యం కలగక మానదు. ప్రభుత్వ రంగ ఎస్ బీఐలో 20 ఏళ్లకే స్వీపర్ గా చేరి 57 ఏళ్ల వయసుకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పగ్గాలు చేపట్టడం అంటే నిజంగా అభినందనీయం. దీని వెనుక ఆమె కృషి గురించి తెలుసుకోవాల్సిందే.

మహారాష్ట్రకు చెందిన ప్రతీక్షా తొండ్ వాల్కర్ గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. 1964లో ఆమె పూణెలో జన్మించారు. పేద కుటుంబం కావడంతో 16 ఏళ్ల వయసులోనే సదాశివ్ కడుతో ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి జరిపించారు. అప్పటికి ఆమె 10వ తరగతి చదువుతోంది. ఇంకా పరీక్షలు కూడా పూర్తి కాలేదు.  

ప్రతీక్షను వివాహం చేసుకున్న సదాశివ్ ముంబైకి చెందిన వ్యక్తి. ఎస్ బీఐలో బుక్ బైండర్ గా పనిచేసేవాడు. వారికి ఒక బాబు జన్మించాడు. వినాయక్ అని పేరు పెట్టుకున్నారు. కుమారుడితో పాటు ఆ దంపతులు పూణెకు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ప్రమాదం కారణంగా సదాశివ్ మరణించాడు. దీంతో చిన్న వయసులోనే ప్రతీక్ష తోడును కోల్పోయారు. 

ఆ సమయంలో తన భర్తకు సంబంధించి రావాల్సిన డబ్బులను తీసుకునేందుకు ఎస్ బీఐ శాఖకు వెళ్లింది. ఏదైనా పని ఉంటే ఇప్పించాలని ఆ సందర్భంలో బ్యాంకు అధికారిని వేడుకుంది. దీంతో స్వీపర్ గా అవకాశం ఇచ్చారు. దాంతో ప్రతి రోజూ ఉదయం రెండు గంటలు బ్యాంకు శాఖను శుభ్రంగా ఊడ్చి, టాయిలెట్స్ కడగడం చేసేది. దీనికి గాను నెలకు రూ.60-65 ఇచ్చేవారు. మిగిలిన సమయంలో ఆమె చిన్న చిన్న పనులతో నెట్టుకొచ్చేది. 

బ్యాంకులో ఉద్యోగులను చూసినప్పుడు ఆమెలో ఆలోచన మొదలైంది. తాను ఉన్నది ఈ పనులకు కాదని, వారి మాదిరే తాను కూడా జాబ్ చేయాలని అనిపించేది. బ్యాంకు ఉన్నతాధికారుల సహకారంతో పదో తరగతిని 60 శాతం మార్కులతో పూర్తి చేసింది. పుస్తకాలు కొనుక్కోవడానికి బంధువులు, స్నేహితులు సాయం చేశారు. 

బ్యాంక్ పరీక్ష రాసి ఉద్యోగం సంపాదిస్తేనే తనుకున్న ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కగలనని ప్రతీక్షకు అనిపించింది. కానీ బ్యాంకు పరీక్షలకు 12వ తరగతి అర్హత కావాలని తెలిసింది. కుమారుడు వినాయక్ బిస్కెట్ అడిగితే బస్సులో ఒక స్టాప్ ముందు దిగి, ఆదా చేసుకున్న మొత్తంతో కొనిచ్చే పరిస్థితి ఆమెది. దీంతో రాత్రి కాలేజీలో చేరింది. తోటి ఉద్యోగుల సహకారంతో ఇంటర్ పాస్ అవడమే కాకుండా,  గ్రాడ్యుయేషన్ లో సైకాలజీ కోర్సులో చేరింది. అది కూడా రాత్రి కళాశాలే కావడం గమనార్హం. ఆ సమయంలోనే ఆమెను బ్యాంకులో క్లర్క్ కు ప్రమోట్ చేశారు. 

1993లో ఆమె ప్రమోద్ తొండ్ వాల్కర్ ను ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఆయన బ్యాంకులో మెస్సెంజర్. కుటుంబ పనులన్నీ తనే చూసుకుంటూ, భార్య ప్రతీక్షకు పూర్తి వెన్ను దన్నుగా నిలవడంతో ఆమె మరింత ఎత్తుకు ఎదిగేందుకు మార్గం ఏర్పడింది. బ్యాంకు పరీక్షలు రాసేందుకు ప్రోత్సాహం అందించాడు. ఎంతలా అంటే.. తనకు పక్షవాతం వచ్చినప్పటికీ, భార్య చదువుకునే సమయంలో టీ అందించేవాడు. దీంతో ఆమె పరీక్షలు రాసి 2004లో ట్రైనీ ఆఫీసర్ గా ఉద్యోగం పొందారు. 

ఆ తర్వాత ఆఫీసర్ గా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన అనంతరం ఈ ఏడాది జూన్ లో ఎస్ బీఐ ఏజీఎంగా బాధ్యతలు చేపట్టారు. మరో రెండేళ్ల సర్వీసు ఆమెకు మిగిలి ఉంది. 2021లో ఆమె నేచురోపతీ కోర్స్ చేశారు. దీంతో రిటైర్మెంట్ తర్వాత ప్రజలకు సేవలు అందించాలన్నది ఆమె సంకల్పం.

More Telugu News