Rohit Sharma: చివరి ఓవర్ బౌలింగ్ నిర్ణయంపై వివరణ ఇచ్చిన రోహిత్ శర్మ

  • 19వ ఓవర్ ను అద్భుతంగా వేసిన అర్షదీప్ సింగ్
  • 20వ ఓవర్లో ప్రత్యర్థి విజయాన్ని సులభం చేసిన అవేశ్ ఖాన్ 
  • అనుభవం లేని బౌలర్ కు చివరి ఓవర్ ఇవ్వడంపై విమర్శలు
  • అవకాశాలు ఇస్తే కదా తెలిసేదన్న రోహిత్
Rohit reveals huge reason behind picking Avesh Khan over Bhuvneshwar in final over of 2nd T20

వెస్టిండీస్ తో రెండో టీ20లో మ్యాచ్ ఫలితాన్ని చివరి ఓవర్ మార్చేసింది. అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేని అవేశ్ ఖాన్ చేతికి చివరి ఓవర్ బౌలింగ్ ఇస్తూ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తన నిర్ణయాన్ని రోహిత్ సమర్థించుకున్నాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టును వెస్టిండీస్ బౌలర్లు 138 పరుగులకు కట్టడి చేశారు. మన బౌలర్లు కూడా మెరుగ్గానే బౌలింగ్ చేశారు. చివరి రెండు ఓవర్లలో గెలుపు కోసం వెస్టిండీస్ 16 పరుగులు సాధించాల్సి ఉంది. 19వ ఓవర్ లో అర్షదీప్ సింగ్ చక్కని నైపుణ్యంతో బౌలింగ్ చేసి రావ్ మన్ పావెల్ వికెట్ తీయడంతోపాటు, ఆరు పరుగులే ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్ లో 10 పరుగులు చేయాల్సి ఉంది. భువనేశ్వర్ కుమార్ చేతికి బౌలింగ్ వెళుతుందని అభిమానులు భావించారు. కానీ, ఆశ్చర్యకరంగా అవేశ్ ఖాన్ పై నమ్మకం ఉంచి అతడి చేతికి బౌలింగ్ అప్పగించాడు రోహిత్ శర్మ.

అవేశ్ ఖాన్ అనుభవలేమి మొదటి బంతి నోబాల్ కావడంతోనే తెలిసిపోయింది. తర్వాతి బంతి (మొదటి)కి సిక్స్, తర్వాతి బంతికి ఫోర్ సాధించడంతో వెస్టిండీస్ విజయం సాధించింది. చివరి ఓవర్ ను మరింత అనుభవం ఉన్న భువనేశ్వర్ కు ఎందుకు ఇవ్వలేదన్న దానిపై రోహిత్ స్పందించాడు. 

‘‘భువీ ఉన్నాడని తెలుసు. ఎన్నో ఏళ్లుగా అతడు ఈ పని చేస్తూనే ఉన్నాడు. అవేశ్, అర్షదీప్ వంటి వారికి అవకాశాలు ఇవ్వకపోతే తెలుసుకోలేం. ఇది ఒక గేమ్ మాత్రమే. వారికి కావాల్సినన్ని నైపుణ్యాలు ఉన్నాయి. వారికి మద్దతుగా నిలవాలి. బౌలర్లు, జట్టును చూసి నేను నిజంగా గర్విస్తున్నా. నిజానికి ఈ లక్ష్యాన్ని వెస్టిండీస్ 13-14 ఓవర్లలోనే పూర్తి చేయాలి. కానీ మేము చివరి ఓవర్ వరకు లాక్కొచ్చాము. మా బౌలర్లు చక్కని ప్రణాళికతో ఆ పనిచేశారు" అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్. 

More Telugu News