Roja: ముంపు గ్రామాలను జిల్లాగా చేస్తానని అనడం హాస్యాస్పదం: మంత్రి రోజా

Roja fires on Chandrababu
  • అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు పట్టించుకోలేదన్న రోజా 
  • వరదలు అయిపోయాక కూడా బురద రాజకీయాలు చేస్తున్నారని విమర్శ 
  • భగవంతుని దయవల్లే తాను మంత్రిని అయ్యానని వ్యాఖ్య 
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని  మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని... విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టి టీడీపీ నేతలు ఎంజాయ్ చేశారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించకుండా జయము జయము చంద్రన్న అంటూ భజనలు చేయించుకున్నారని... పోలవరంను ఏటీఎంలా వాడుకున్నారని అన్నారు. కుప్పంను మున్సిపాలిటీగా కూడా చేసుకోలేని వ్యక్తి... ముంపు గ్రామాలను జిల్లాగా చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. వరదలైపోయాక కూడా చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. భగవంతుని దయవల్లే తాను మంత్రిని అయ్యానని చెప్పారు. 

ఈరోజు రోజా తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో స్వామిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నారని కొనియాడారు. జగన్ పాలనలో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ 150కి పైగా సీట్లను సాధించి మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Roja
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News