Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం

  • కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
  • నగరంలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం
  • రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు
  • ఆగస్టు 3, 4 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు
Heavy rain caused water logging in Hyderabad

హైదరాబాద్ నగరంపై వరుణుడు మరోసారి పంజా విసిరాడు. నగరంలో ఈ సాయంత్రం భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అమీర్ పేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, పంజాగుట్ట, షేక్ పేట, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అత్తాపూర్, దోమలగూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాజేంద్రనగర్, మణికొండ, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో చేరిన నీరు ఇంకా తొలగిపోలేదు. ఇప్పుడు మరోసారి వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

కాగా, దక్షిణ చత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో  రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆగస్టు 3, 4 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.

More Telugu News