Congress: ఝార్ఖండ్ ఎమ్మెల్యే కారులో భారీగా పట్టుబడిన నగదు.. హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకేనా?

  • హౌరా వద్ద పట్టుబడిన ఎమ్మెల్యేలు
  • పట్టుబడిన నగదును లెక్కించేందుకు కౌంటింగ్ మెషీన్లు తెప్పించిన పోలీసులు
  • కాంగ్రెస్, బీజేపీ పరస్పర ఆరోపణలు
  • బీజేపీకి ఇలాంటివి అలవాటేనన్న కాంగ్రెస్
3 Jharkhand Congress Leaders Detained With Huge Cash In Bengal

ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న కారు నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో నగదు పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలను ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచప్, మన్ బిక్సల్ కొంగరిగా గుర్తించారు. ఎమ్మెల్యే బేరసారాల కోసమే ఈ సొమ్మును తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పట్టుబడిన మొత్తాన్ని లెక్కించేందుకు కౌంటింగ్ మెషీన్లను తెప్పిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ వాహనంపై ‘జామ్‌తరా ఎమ్మెల్యే’ అని స్టిక్కరింగ్ ఉంది. దీనిని బట్టి అది ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీదేనని గుర్తించారు. ఖిరిజీ నుంచి కచప్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తుండగా, కొంగరి.. కోలెబిరాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఝార్ఖండ్‌లోని ముక్తి మోర్చా-కాంగ్రెస్  సారథ్యంలోని హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీనే ఆ సొమ్ము ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది కచ్చితంగా బీజేపీ పనేనని, బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ఝార్ఖండ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు టిర్కీ ఆరోపించారు. 

ఈ ఆరోపణలపై స్పందించిన ఝార్ఖండ్ బీజేపీ నేత అదిత్య సాహు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని జేఎంఎం-కాంగ్రెస్ అవినీతికి పట్టుబడిన సొమ్మే ఉదాహరణ అని ఆరోపించారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందన్నారు. ప్రజాధనాన్ని వారు ‘ఇతర’ అవసరాల కోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు. 

బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్  కూడా ఈ ఘటనపై స్పందించింది. ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు హార్స్‌ట్రేడింగ్ (బేరసారాలు) కోసమే ఈ సొమ్మును తరలిస్తున్నట్టు టీఎంసీ ఓ ట్వీట్‌లో ఆరోపించింది. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల మాట్లాడుతూ.. మహారాష్ట్రలానే ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని కూడా కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

More Telugu News