Joe Biden: కీలక పదవికి భారత సంతతి వ్యక్తిని నామినేట్ చేసిన బైడెన్

Joe Biden nominates Indian origin Shailen P Bhatt in a key post
  • రవాణా రంగ అడ్మినిస్ట్రేటర్ గా శైలేన్ పి భట్
  • గతంలో వివిధ స్థాయుల్లో సేవలు అందించిన భట్
  • భట్ సామర్థ్యంపై నమ్మకం వ్యక్తం చేసిన వైట్ హౌస్
అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వంలో లో గత కొంతకాలంగా భారత సంతతి వ్యక్తులకు అధిక ప్రాధాన్యత దక్కుతోంది. కీలక పదవుల్లో భారత సంతతి నిపుణులను నియమించేందుకు అక్కడి ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. రాజకీయాల్లోనే కాకుండా, నామినేటెడ్ పదవుల్లోనూ మనవాళ్ల హవా కొనసాగుతోంది. తాజాగా, అమెరికా రవాణా శాఖలో అడ్మినిస్ట్రేటర్ గా శైలేన్ పి భట్ ను దేశాధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. 

శైలేన్ పి భట్ గతంలో ప్రభుత్వ, ప్రైవేటు రవాణా రంగాల్లో పలు స్థాయుల్లో విశిష్ట సేవలు అందించారు. 2021 నుంచి ఆయన బహుళజాతి మౌలిక సదుపాయాల కన్సల్టెన్సీ సంస్థ ఏఈసీఓఎం వద్ద గ్లోబల్ ట్రాన్స్ పోర్టేషన్ ఇన్నోవేషన్ అండ్ ఆల్టర్ నేటివ్ డెలివరీ విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

గతంలో కొలరాడో రాష్ట్ర రవాణా శాఖ క్యాబినెట్ కార్యదర్శిగానూ, ఇంటెలిజెంట్ ట్రాన్స్ పోర్టేషన్ సొసైటీ ఆఫ్ అమెరికా సంస్థకు సీఈవోగానూ, నేషనల్ ఆపరేషన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధిపతిగానూ, 1-95 కారిడార్ కోలిషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గానూ వ్యహరించారు. అంతేకాదు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ అజెండా కౌన్సిల్ లో భట్ సభ్యుడుగా వ్యవహరించారు. ఇవేకాకుండా, ఇంకా అనేక పదవుల్లో ఆయన సేవలు అందించారు. 

భట్ ను బైడెన్ నామినేట్ చేయడంపై వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. నూతన భాగస్వామ్యాలు, వినూత్న మార్గాల్లో భట్ రవాణా రంగాన్ని మరింత ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నట్టు వైట్ హౌస్ పేర్కొంది. సురక్షిత, సుస్థిర, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా రవాణా వ్యవస్థను తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నట్టు వెల్లడించింది.
Joe Biden
Shailen P Bhatt
Nominate
Federal Transport Dept
White House
USA

More Telugu News