West Bengal: కూతురు ఇంట్లో కోట్ల కొద్దీ నోట్ల కట్టలు.. శిథిలావస్థలో ఉన్న ఇంట్లో అర్పిత ముఖర్జీ తల్లి జీవనం

  • కోల్ కతాలోని బెల్గోరియాలో అర్పిత పూర్వీకుల ఇల్లు
  • ఎలాంటి సౌకర్యాలు లేని పరిస్థితుల్లో అనారోగ్యంతో తల్లి జీవనం
  • అరెస్టయ్యే వారం ముందు తల్లి దగ్గరకు వచ్చి కొన్ని గంటలే ఉన్న అర్పిత
 Arpita Mukherjees mother lives in run down old house

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్  ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో అరెస్టయిన అర్పిత ముఖర్జీ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. కోల్ కతాలోని ఆమె విలాసవంతమైన నివాసంలో ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)  రూ. 50 కోట్ల పైచిలుకు నగదు.. పది కిలోలకు పైగా బంగారం స్వాదీనం చేసుకుంది. 

ఈ దాడుల్లో అర్పిత ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు చూసి అంతా ఆశ్చర్యపోయారు. బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీకి సన్నిహితురాలైన అర్పిత కోల్ కతాలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కానీ, ఆమె తల్లి మినాటి ముఖర్జీ మాత్రం ఎలాంటి సౌకర్యాలు లేని అతి సాధారణ ఇంట్లో ఉన్నారు. కోల్‌కతాలోని బెల్గోరియాలో శిథిలావస్థలో ఈ ఇల్లు వుంది. 

ఈ కేసులో అరెస్టయ్యే వారం ముందు తన కుమార్తె ఇంటికి వచ్చిందని అర్పిత తల్లి మినాటి తెలిపారు. ఎప్పుడు వచ్చినా ఎక్కువ సేపు ఉండదని, తనను చూసి కొన్నిగంటల్లోనే వెళ్లిపోయేదన్నారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకునేందుకు అర్పిత ఇద్దరు సహాయకులను నియమించిందని స్థానికులు చెబుతున్నారు. 

కాగా, తన కుమార్తె అరెస్టు అయిన కొన్ని రోజుల తర్వాత మినాటి ముఖర్జీ మీడియాతో మాట్లాడారు. తాను చెప్పినట్టు వింటే అర్పితకు తాను పెళ్లి చేసేదాన్నని ఆమె తెలిపారు. అర్పిత తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేశారని, కానీ ఆమెకు మాత్రం ఉద్యోగంపై ఆసక్తి లేదని చెప్పారు. సినిమాలు, టీవీల్లో నటించాలన్న కోరికతో చాలా కాలం కిందటే కూతురు ఈ ఇంటిని విడిచిపెట్టిందని వెల్లడించారు. అర్పితను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందన్నారు. అయితే, ఆమె ఆర్థిక లావాదేవీల గురించి తనకు ఎలాంటి అవగాహన లేదని మినాటి స్పష్టం చేశారు.

More Telugu News