NEOM: నియోమ్... సౌదీ అరేబియాలో అద్భుత నగరం

  • తబూక్ ప్రావిన్స్ లో నిర్మాణం
  • 2017లో నియోమ్ కు శ్రీకారం
  • సౌదీ యువరాజు కలల నగరంగా నియోమ్
  • 10 వేల చదరపు మైళ్ల విస్తీర్ణంలో కృత్రిమ నగరం
Saudi Arabia constructs ultra smart city NEOM

అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా ఓ అద్భుతమైన నగర నిర్మాణానికి పూనుకుంది. ఆ నగరం పేరు నియోమ్. నియోమ్ (NEOM) లో నియో అంటూ కొత్త అని అర్థం. ఇక చివరన వచ్చే ఎం ముస్తాక్ బల్ అనే పదాన్ని సూచిస్తుంది. అంటే భవిష్యత్తు అని అర్థం. చమురు ఎగుమతులతో ధనిక దేశంగా పేరుగాంచిన సౌదీ అరేబియా 2017లో నియోమ్ కు శ్రీకారం చుట్టింది. ఇదొక సాంకేతిక మాయాజాలంతో కూడిన నగరంగా భావించవచ్చు. గాల్లో ఎగిరే ట్యాక్సీలు, రోబో పనిమనుషులు, నమ్మశక్యం కాని ఆధునికతతో కూడిన ఆకాశ హర్మ్యాలు ఈ భవిష్యత్ నగరంలో కనువిందు చేయనున్నాయి. 

ఈ అల్ట్రా స్మార్ట్ సిటీని సౌదీ అరేబియాలోని తబూక్ ప్రావిన్స్ లో 10,200 చదరపు మైళ్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఎర్ర సముద్రం పొడవునా 170 కిలోమీటర్ల మేర ఈ నగరం విస్తరించనుంది. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కలల నగరంగా పేర్కొంటున్న నియోయ్ ను ఎడారిలో స్వర్గంగా భావించవచ్చు. తాజాగా ఈ ప్రాజెక్టు వివరాలను మహ్మద్ బిన్ సల్మాన్ ప్రపంచం ముందుంచారు. ఈ భూమండలంపై అత్యంత ఆవాసయోగ్యమైన నగరంగా నియోమ్ వర్ధిల్లుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

ఈ అద్భుత నగరంలో 2030 నాటికి 1.2 మిలియన్ జనాభా ఉండొచ్చని, 2045 నాటికి జనాభా 9 మిలియన్లకు చేరుకుంటుందని అన్నారు. 2030 నాటికి సౌదీ అరేబియాలో 50 మిలియన్ల మంది జీవించేలా చేయడమే తమ లక్ష్యమని, వారిలో సగం మంది సౌదీ జాతీయులు, సగం మంది విదేశాల నుంచి వచ్చినవారు అని యువరాజు వివరించారు. ప్రస్తుతం సౌదీ జనాభా దాదాపుగా 34 మిలియన్లు. 

2040 నాటికి సౌదీ అరేబియా జనాభా 100 మిలియన్లకు చేర్చడమే తమ లక్ష్యమని, భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా ప్రజలకు ఆవాసాలు ఏర్పరచాలన్న ఉద్దేశంతోనే నియోమ్ వంటి నగరాల నిర్మాణానికి పూనుకున్నామని వివరించారు. నియోమ్ నగరం 100 శాతం పునరుత్పాదక ఇంధన శక్తిని వినియోగించుకుంటుందని, సహజమైన వెంటిలేషన్ సౌకర్యంతో ఏడాది పొడవునా సమశీతోష్ణ వాతావరణం ఉండేలా డిజైన్ చేస్తున్నట్టు నియోమ్ ప్రచార వీడియోలో పేర్కొన్నారు. 

కాలుష్యానికి ఏమాత్రం తావులేని రీతిలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన గ్రీన్ హైడ్రోజన్ ఇంధన ప్లాంట్ ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఇదే కాకుండా పవన విద్యుత్, సౌర విద్యుత్ ను కూడా వినియోగించుకోనున్నారు. ఈ అత్యంత ఆధునిక నగరం నిర్మాణానికి వ్యయం కూడా అదేస్థాయిలో ఉంది. 2030 నాటికి తొలిదశ పూర్తి చేయాలని సంకల్పించగా, అందుకు రూ.25 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రభుత్వ రాయితీలు మాత్రమే కాకుండా, ప్రైవేటు భాగస్వామ్యాలు, పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధుల సేకరణ ఉంటుందని తెలిపారు.

More Telugu News