Biocon chief: దెబ్బతిన్న రోడ్డుకు క్షణాల్లో రిపేర్.. ఆసక్తికర టెక్నాలజీ అంటున్న కిరణ్ మజుందార్ షా

Biocon chief Kiran Mazumdar suggested this to repair Bengaluru roads
  • పంక్చర్ వేసినంత సులువుగా రోడ్డు రిపేర్
  • అమెరికన్ రోడ్డు ప్యాచ్ టెక్నాలజీ ప్రత్యేకత
  • ట్విట్టర్ లో షేర్ చేసిన బయోకాన్ చైర్ పర్సన్ 
వర్షాకాలంలో నీటికి తారు రోడ్లు బాగా దెబ్బతింటుంటాయి. పట్టణాల్లో ఈ ఇబ్బంది మరీ ఎక్కువ. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల నీరు రహదారులపైకి చేరి ఎక్కువ నష్టం జరుగుతుంటుంది. బెంగళూరు వాసులు ఇలా దెబ్బతిన్న రోడ్లతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారంగా ప్రముఖ ఫార్మా సంస్థ బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా ఓ సరికొత్త టెక్నాలజీని సూచించారు. 

రోడ్లను వేగంగా రిపేర్ చేసేందుకు ఆసక్తికరమైన టెక్నాలజీ ఇదంటూ ఆమె ఓ వీడియోను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. వాహనం టైర్ కు పంక్చర్ అయితే, ప్యాచ్ వేస్తాం తెలుసుగా? అదే మాదిరిగా దెబ్బతిన్న రోడ్డుపై ప్యాచ్ వేయడాన్ని ఇందులో చూడొచ్చు. దెబ్బతిన్న చోట ఓ షీటు వేసి, బరువుతో చదును చేయడాన్ని గమనించొచ్చు. ప్యాచ్ షీటుకు ఒకవైపు గమ్ ఉంటుంది. దాన్ని స్టిక్కర్ మాదిరే రోడ్డుకు అతికించేస్తారు. ఈ టెక్నాలజీని అమెరికన్ రోడ్డు ప్యాచ్ గా పిలుస్తారు. 

దీన్ని తారు రోడ్లకే కాకుండా, కాంక్రీటు రోడ్ల ప్యాచ్ లకు సైతం వినియోగించొచ్చు. సంప్రదాయ రోడ్డు రిపేర్ విధానాల్లో అయితే దెబ్బతిన్న చోట తిరిగి తారు కాంక్రీటు వేయడం, కొంత సమయం పాటు అటుగా వాహనాలు నిలిపివేయడం చేయాల్సి వస్తుంది. కానీ, ఈ అమెరికన్ రోడ్డు ప్యాచ్ విధానంలో నిమిషాల్లోనే మొత్తం పూర్తవుతుంది. వాహనాల రాకపోకలు సాగించుకోవచ్చు. ఈ టెక్నాలజీని బెంగళూరు నగరపాలిక కమిషనర్ కు కిరణ్ మజుందార్ షా ట్విట్టర్లో ట్యాగ్ చేశారు.
Biocon chief
Kiran Mazumdar
road repair
new technology
road patch

More Telugu News