tdp: ప్రజల ప్రాణాలు తీసేవరకు రోడ్లను బాగు చెయ్యకపోవడం క్షమించరాని నేరం: చంద్రబాబు

TDP Chief Chandrababu slams Ap govt over roads damage
  • రోడ్డుపై గుంత కారణంగా యువకుడి మృతి ఘటనపై బాబు స్పందన
  • ప్రభుత్వ నిర్లక్షం కారణంగానే అతను మృతి చెందాడని ఆరోపణ
  • ఏపీలో తక్షణమే రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేసిన ప్రతిపక్ష నేత
ఆంధ్రప్రదేశ్ లో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగు చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్డుపై గుంత కారణంగా బైక్ పై నుంచి పడి పశ్చిమ గోదావరికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే యువకుడు మృతి చెందిన ఘటనపై చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అతను మరణించాడన్నారు. ప్రజల ప్రాణాలు తీసేవరకు రోడ్లను బాగు చెయ్యకపోవడం క్షమించరాని నేరం అన్నారు. ప్రజల ప్రాణాలకు ప్రభుత్వం బాధ్యతగా నిలవాలన్నారు.
 
‘వర్షాలకు రోడ్లు పాడవడం కొత్త కాదు. కానీ ప్రజల ప్రాణాలు తీసేవరకు వాటిని బాగు చెయ్యక పోవడం మాత్రం క్షమించరాని నేరం. పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం, ముదునూరులో ప్రవీణ్ కుమార్ అనే యువకుడు బైక్ మీద వెళ్తూ, రావికుంట దగ్గర రోడ్డుపై ఉన్న గొయ్యి కారణంగా దుర్మరణం చెందడం బాధాకరం. దక్షిణాఫ్రికాలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసేందుకు వచ్చి, వారం రోజుల్లో తిరిగి వెళ్లిపోతాడనగా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం అతన్ని తిరిగిరాని లోకాలకు పంపించేసిందన్న వార్త మనసును కలచివేసింది. ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలోని రోడ్లను బాగుచేయాలి. ప్రజల ప్రాణాలకు బాధ్యతగా నిలవాలి’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
tdp
Chandrababu
Andhra Pradesh
YSRCP
Road Accident
road damge

More Telugu News