foods: ఈ ఆహార పదార్థాలను కలిపి తీసుకోకూడదంటున్న పోషకాహార నిపుణులు

  • పండ్లు, భోజనం ఒకేసారి వద్దు
  • పాలు, విటమిన్ సీ ఆహారం కూడా సరికాదు
  • నట్స్ తోపాటు టీ తాగడం చేయవద్దు
  • పోషకాహార నిపుణుల సూచనలు
foods to avoid eating together

ఆహార పదార్థాలు ఏవైనా మితంగా తింటే మంచిదే. అందులో కొన్ని రకాల ఆహార పదార్థాల మధ్య పొందిక ఉండదు. అలాంటి వాటిని ఒకదాని వెంట ఒకటి, ఒకేసారి కలిపి తినడం వల్ల కొన్ని రకాల సమస్యలు ఏర్పడతాయి. అందుకని అలాంటి ఆహార పదార్థాల గురించి అవగాహన కలిగి ఉండాలి. ఆయుర్వేదంలో వీటిని విరుద్ధ ఆహారంగా చెబుతారు. ఇలాంటివి కలిపి తీసుకోవడం వల్ల పోషకాలను శరీరం గ్రహించుకోలేదు. జీర్ణ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. దీంతో తిన్నా ఆ ప్రయోజనం మనకు అందదు. 


కూరగాయలు..
క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొకోలీ, పాలకూర ఇలాంటి వాటిని క్రూసిఫెరస్ కూరగాయలుగా చెబుతారు. అయోడిన్ ను మన శరీరం గ్రహించకుండా చేసే కెమికల్ కాంపౌండ్ వీటిల్లో ఉంటుంది. దీంతో థైరాయిడ్ గ్రంధి పనితీరుపై ప్రభావం పడుతుంది. కనుక థైరాయిడ్ సమస్యలు ఉన్న వారు వీటి వినియోగాన్ని తగ్గించుకోవాలి. వీటిని చేపలు, డైరీ ఉత్పత్తులు, శుద్ధి చేసిన సాల్ట్ తో కలిపి తీసుకోకూడదు. 

విటమిన్ సీ, పాలు
విటమిన్ సీ తగినంత లభించే బచ్చలి కూర, సిట్రస్ పండ్లు.. నిమ్మకాయలు, కమలా, బత్తాయి, ప్లమ్, బెర్రీలలో కేసియన్ అనే యాసిడ్ ఉంటుంది. వీటిని పాలు, పాల పదార్థాలతో కలిపి తినకూడదు. కలిపి తీసుకోవడం వల్ల పాలు జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. పాలు గడ్డకట్టడం వల్ల గ్యాస్, గుండె మంట తదితర సమస్యలు కనిపిస్తాయి.

పండ్లు, భోజనం
పండ్లు చాలా తేలిగ్గా జీర్ణం అవుతాయి. భోజనాన్ని పూర్తిగా అరాయించుకునేందుకు జీర్ణాశయానికి మరింత సమయం అవసరం. అందుకుని జీర్ణమయ్యే సమయం విషయంలో ఏ మాత్రం పోలిక లేని ఈ రెండింటినీ ఒకేసారి తీసుకోవద్దన్నది పోషకాహార నిపుణుల సూచన. దీనివల్ల ఆహారం జీర్ణమయ్యి, పండ్లు అజీర్ణంగా ఉంటాయి. దానివల్ల ఫెర్మన్టేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇది గ్యాస్ సమస్యలు కలిగిస్తుంది. 

టీ, ఆహారం
నట్స్, ముడి ధాన్యాలు, ఆకుపచ్చని కూరగాయల్లో ఐరన్ తగినంత ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఐరన్ లోపం ఉండదు. కానీ, టీతో కలిపి ఈ పదార్థాలను తీసుకోవద్దు. ఎందుకంటే టీలోని ట్యాన్నిస్, ఆక్సలేట్స్.. ఐరన్ ను మన శరీరం తీసుకోకుండా అడ్డుకుంటాయి. 

నట్స్
 నట్స్ (వాల్ నట్స్, పీనట్స్, ఆల్మండ్, పీస్, లెంటిల్స్ తదితర)లో ఫైటిక్ యాసిడ్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది నట్స్ లో ఉన్న ఐరన్, క్యాల్షియం, జింక్ ను మన శరీరం గ్రహించుకోకుండా చేస్తుంది. అందుకే వీటిని రాత్రి నీటిలో నానవేసి మర్నాడు ఉదయం తీసుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల వాటి పొట్టులోని యాసిడ్ కంటెంట్ తగ్గిపోతుంది.

More Telugu News