Africa: ప్రపంచంలో అరుదైన అతి పెద్ద పింక్ వజ్రం.. విలువ రూ.900 కోట్లపైనే..!

  • ఆఫ్రికాలోని అంగోలాలో గుర్తించిన లుపాకా డైమండ్ కంపెనీ
  • ప్రపంచవ్యాప్తంగా గత 300 ఏళ్లలో దొరికిన వజ్రాల్లో ఇదే పెద్దదని అంచనా
  • ఇలాంటి అత్యంత స్వచ్ఛమైన, లేత గులాబీ రంగు వజ్రాలు అరుదని వెల్లడి
Rare largest pink diamond unearthed in angola

ఆఫ్రికా ఖండంలోని అంగోలా ప్రపంచంలోనే అరుదైన పెద్ద పింక్ వజ్రం బయటపడింది. అంగోలాలో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతున్న ఆస్ట్రేలియన్ సంస్థ లుపాకా డైమండ్ కంపెనీ ఈ డైమండ్ ను గుర్తించినట్టు ప్రకటించింది. ఈ వజ్రం అచ్చమైన లేత గులాబీ రంగులో ఏకంగా 170 క్యారెట్ల బరువు ఉందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా గత 300 ఏళ్లలో గుర్తించిన అతిపెద్ద పింక్ డైమండ్ ఇదేనని భావిస్తున్నట్టు వెల్లడించింది. 

పింక్ డైమండ్.. లులో రోజ్..
సహజమైన వజ్రాల్లో అత్యంత స్వచ్ఛతతో, పూర్తిగా ఒకే రంగుతో ఉన్నవి అత్యంత అరుదని.. ఈ పింక్ డైమండ్ ఆ అరుదైన కేటగిరీలోకి వస్తుందని లుపాకా కంపెనీ ప్రకటించింది. ఈ వజ్రానికి లులో రోజ్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ముడి రూపంలో ఈ వజ్రాన్ని సానబెడితే.. 85 నుంచి 90 క్యారెట్ల వరకు ఉండే ఒక పెద్ద పాలిష్డ్ వజ్రం, మరిన్ని చిన్న వజ్రాలు రూపొందుతాయని లుకాపా డైమండ్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దీనిని త్వరలో వేలం వేయనున్నట్టు తెలిపారు. అయితే ధర ఎంత వస్తుందనేది ఇంకా అంచనా వేయలేదు.

‘పింక్ స్టార్’ కన్నా ఎక్కువే..
2017లో అచ్చం ఇదే తరహాలోని స్వచ్ఛమైన డైమండ్ ‘పింక్ స్టార్’ను హాంకాంగ్ లో వేలం వేశారు. 59.6 క్యారెట్ల బరువైన ఆ వజ్రానికి 71.2 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.570 కోట్లు) పలికింది. కేవలం ఒక్క వజ్రానికి పలికిన అత్యధిక ధర విషయంగా అదే ప్రపంచంలో అత్యధిక విలువ కావడం గమనార్హం. ఇప్పుడు అత్యంత స్వచ్ఛమైన పింక్ డైమండ్ అయిన ‘లులో రోజ్’ సుమారు 90 క్యారెట్ల వరకు ఉండనుండటంతో.. ‘పింక్ స్టార్’ కన్నా భారీగా ధర పలకవచ్చని అంచనా వేస్తున్నారు. అంటే రూ.900 కోట్ల నుంచి రూ.1000 కోట్ల దాకా ఉండొచ్చని భావిస్తున్నారు.

More Telugu News