Ashok Thamarakshan: సొంతంగా విమానం తయారు చేసుకుని యూకేలో విహారయాత్రకు వెళ్లిన కేరళ మాజీ ఎమ్మెల్యే తనయుడు

Kerala former MLA son Ashok Thamarakshan built four seater plane and tours with family across UK
  • లండన్ లో స్థిరపడిన అశోక్ తామరక్షన్
  • ఫోర్డ్ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్ గా ఉద్యోగం
  • కుటుంబం అంతా టూర్ వెళ్లేందుకు 4 సీట్ల విమానం తయారీ
  • సొంతంగా కిట్ కొనుక్కుని ఇంట్లోనే తయారీ
కేరళలోని అలప్పుళ ప్రాంతానికి చెందిన అశోక్ అలిసెరిల్  తామరక్షన్ ఓ మెకానికల్ ఇంజినీర్. అశోక్ మాజీ ఎమ్మెల్యే వి.తామరక్షన్ కుమారుడు. పాలక్కాడ్ లోని ఇంజినీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పట్టా పుచ్చుకున్న అనంతరం మెకానికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ కోసం 2006లో బ్రిటన్ వెళ్లిపోయాడు. ఆపై పెళ్లి చేసుకుని ఫోర్డ్ మోటార్ కంపెనీలో మంచి ఉద్యోగంతో లండన్ లో స్థిరపడ్డాడు. 2018లో పైలెట్ లైసెన్స్ కూడా పొందాడు. 

కరోనా సంక్షోభానికి ముందు అశోక్ 2 సీట్ల చిన్న విమానాన్ని అద్దెకు తీసుకుని సరదాగా విహరించేవాడు. ఇప్పుడతడి కుటుంబ సభ్యుల సంఖ్య నాలుగుకి పెరిగింది. తనతో పాటు భార్య, ఇద్దరు కుమార్తెలను కూడా టూర్ కు తీసుకెళ్లాలంటే 4 సీట్ల విమానం కావాలి. దాంతో కరోనా లాక్ డౌన్ సమయంలో 4 సీట్ల విమానం తయారీ ఆలోచన వచ్చింది. సాధారణంగా సింగిల్ సీటర్, డబుల్ సీటర్ విమానాలు ఎక్కువగా లభ్యమవుతాయి కానీ, 4 సీట్ల విమానాలు చాలా అరుదు అని అశోక్ అభిప్రాయపడ్డాడు. 

ఇక దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్ బర్గ్ కు చెందిన స్లింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అనే కంపెనీ స్లింగ్ టీఎస్ఐ పేరిట విమాన తయారీ కిట్ ను విక్రయిస్తోందని తెలిసి అక్కడికి వెళ్లి పరిశీలించాడు. ఆ కిట్ ను ఆర్డర్ చేసిన తర్వాత లండన్ లోని తన నివాసంలో ఓ వర్క్ షాపు ఏర్పాటు చేసుకుని విమాన తయారీ ప్రారంభించాడు. అశోక్ విమానం తయారు చేస్తుండగా, బ్రిటన్ పౌర విమానయాన శాఖ అధికారులు పలుమార్లు సాధారణ తనిఖీ చేశారు. 

లాక్ డౌన్ సమయంలో తగినంత వ్యవధి దొరకడంతో ఈ కేరళ ఇంజినీర్ సొంతంగా విమాన తయారీని పూర్తి చేశాడు. ఇటీవలే ఫిబ్రవరిలో తన చేతులమీదుగా రూపుదిద్దుకున్న ఈ నాలుగు సీట్ల విమానంలో అశోక్ గగనవిహారం చేసి మురిసిపోయాడు. ఈ విమానం తయారీకి అతడికైన ఖర్చు రూ.1.8 కోట్లు. ఇది గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. ఇదే వేగంతో పయనిస్తే గంటకు 20 లీటర్ల ఇంధనం ఖర్చవుతుంది. ఈ విమానంలో ఇంధన ట్యాంకు సామర్థ్యం 180 లీటర్లు. 

కాగా, ఈ విమానంలో అశోక్ తన కుటుంబంతో కలిసి బ్రిటన్ వ్యాప్తంగా అనేక పర్యాటక స్థలాలను సందర్శించాడు. ఈ విమానం తయారీకి అతడికి 18 నెలలు పట్టింది. తన కుమార్తె పేరిట జి-దియా అని ఆ ప్లేన్ కు నామకరణం చేశాడు. బ్రిటన్ లోని ప్రదేశాలనే కాదు, స్నేహితులతో కలిసి జర్మనీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్ దేశాలను కూడా తన చిన్నవిమానంలో చుట్టొచ్చాడు. 

యూరప్ దేశాలు, అమెరికా తదితర దేశాల్లో ఇలా ఇంట్లోనే తయారుచేసుకునే విమానాలకు అనుమతి ఉంటుంది. భారత్ లో కూడా ఇలాగే అనుమతులు లభిస్తే బాగుంటుందని అశోక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అశోక్ తన భార్య అభిలాష, కుమార్తెలు తార, దియాలతో కలిసి స్వస్థలం అలప్పుళ వచ్చారు.
Ashok Thamarakshan
Plane
Four Seater
UK
Kerala

More Telugu News