Etela Rajender: టీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారు.. ఈ నెల 27 తర్వాత చేరికలు పుంజుకుంటాయి: ఈటల రాజేందర్

  • తమ పోరాటం కేసీఆర్ తోనేననీ, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కాదన్న ఈటల 
  • ఇప్పుడు మంచి రోజులు లేవని, అందుకే పార్టీలోకి ఎవరినీ తీసుకోలేదని వివరణ 
  • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న రాజేందర్ 
Many TRS leaders are in touch with me says Etela Rajender

తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ జోరు పెంచుతోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీసింది. ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి ఆకర్షించేందుకు ఒక టీమ్ ను కూడా బీజేపీ అధిష్ఠానం ఏర్పాటు చేసిందంటే... పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

తాజాగా బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పుడు మంచి రోజులు లేవని, అందుకే పార్టీలోకి ఎవరినీ తీసుకోలేదని చెప్పారు. ఈ నెల 27 తర్వాత చేరికలు పెద్ద సంఖ్యలో ఉంటాయని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈటల జోస్యం చెప్పారు. 

టీఆర్ఎస్ కు చెందిన ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఈటల చెప్పారు. తమ పోరాటం కేవలం కేసీఆర్ తో మాత్రమేనని... టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కాదని అన్నారు. కేసీఆర్ అహంకారాన్ని అందరికంటే ముందు తాను ఎదిరించానని... ఇప్పుడు తన బాటలో నడిచేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందు వల్ల... ఇప్పుడే టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే నియోజకవర్గంలో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనే కారణం వల్ల వారు బహిర్గతం కాలేకపోతున్నారని అన్నారు. 

టీఆర్ఎస్ పార్టీలోని సహచరులతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని... ప్రతి ఒక్కరూ తనతో టచ్ లో ఉన్నారని ఈటల చెప్పారు. కాంగ్రెస్ పార్టీవి మాటలే తప్ప, కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా ఆ పార్టీకి లేదని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరవచ్చని అభిప్రాయపడ్డారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశిస్తే కేసీఆర్ పై పోటీ చేసి... ఆయనను ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News