Mildura: ఆస్ట్రేలియాలోని ఓ పట్టణంలో ఆకాశంలో గులాబీ రంగు వెలుగు... ఏలియన్స్ అయ్యుంటుందని స్థానికుల ప్రచారం

Australian town glows with pink light in the sky
  • మిల్డూరా పట్టణంలో వింత కాంతులు
  • మధ్యలో గులాబీ వెలుగు, చుట్టూ ఊదారంగు కాంతి
  • ప్రపంచానికి అంతం అంటూ హడలిపోయిన స్థానికులు
  • చివరికి అసలు విషయం తెలిసిన వైనం
ఆస్ట్రేలియాలోని ఉత్తర విక్టోరియా ప్రాంతంలో ఉన్న మిల్డూరా పట్టణంలో ఆకాశం ఉన్నట్టుండి గులాబీ రంగులో వెలిగిపోయింది. దాంతో స్థానికులు ఎవరికి తోచింది వారు ప్రచారం చేయసాగారు. చాలామంది అది ఏలియన్స్ పనే అయ్యుంటుందని అభిప్రాయపడ్డారు. మధ్యలో గులాబీ రంగు, చుట్టూ ఊదారంగుతో ఆకాశం కాంతులీనుతుండడం అక్కడి వారు గతంలో ఎప్పుడూ చూడలేదు. ప్రపంచం అంతమవుతోందనడానికి ఇవే సంకేతాలు అని అనుమానం కలుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

అయితే, కాస్త ఆలస్యంగా అసలు విషయం వెల్లడైంది. మిల్డూరా పట్టణం దగ్గర్లో ఓ గంజాయి క్షేత్రం ఉంది. గంజాయి మొక్కల ఎదుగుదలకు స్పెక్ట్రమ్ లైట్ ను వినియోగిస్తుంటారు. కృత్రిమంగా వివిధ రకాల కాంతులను గంజాయి మొక్కలపై ప్రసరింపజేస్తుంటారు. 

మిల్డూరా పట్టణానికి సమీపంలో ఉన్న గంజాయి సాగు క్షేత్రంలోనూ ఇలాంటి స్పెక్ట్రమ్ లైట్ నే ఉపయోగించగా, ఆ లైట్ బయటికి కనిపించకుండా ఏర్పాటు చేసి బ్లైండ్స్ తొలగిపోయాయి. దాంతో ఆ శక్తిమంతమైన లైటింగ్ స్పెక్ట్రమ్ బయటికి వ్యాపించి ఆకాశంలో వింత కాంతులను సృష్టించినట్టు గుర్తించారు. ఏదేమైనా, ఈ విచిత్ర కాంతి పుణ్యమా అని ఆ గంజాయి క్షేత్రం ఎక్కడుందో అధికారులకు తెలిసిపోయింది.
Mildura
Sky
Pink
Alience
Cannabis
Australia

More Telugu News