Telangana: తెలంగాణలో త్వరలోనే తొలి మెట్టు పథకం... ఎందుకోస‌మో తెలుసా?

  • క‌రోనా కార‌ణంగా మూత‌ప‌డ్డ స్కూళ్లు
  • ప్రాథమిక విద్యార్థుల్లో ప‌డిపోయిన విద్యా ప్ర‌మాణాలు
  • వాటిని పెంపొందించేందుకే తొలి మెట్టు
  • ఈ ఏడాదిలో 23 వేల పైచిలుకు పాఠ‌శాల‌ల్లో వ‌ర్తింప‌జేయాల‌ని ల‌క్ష్యం
ts government ready to start new scheme toli mettu in primary scholls

తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారు తొలి మెట్టు పేరిట మ‌రో కొత్త ప‌థ‌కానికి శ్రీకారం చుట్ట‌నుంది. ఈ ప‌థ‌కానికి సంబంధించి విధి విధానాలు ఇప్ప‌టికే ఖ‌రారు కాగా... ప‌థ‌కం ప్రారంభం ఎప్పుడ‌న్న విష‌యం మాత్ర‌మే ఖ‌రారు కావాల్సి ఉంది. ఈ ప‌థ‌కం ముఖ్య ఉద్దేశ్యం ప్ర‌భుత్వ ప్రాథ‌మిక‌ పాఠ‌శాల‌ల‌కు చెందిన విద్యార్థుల్లో సామ‌ర్థ్యం పెంచడ‌మే. తెలంగాణ పాఠ‌శాల విద్యా శాఖ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగ‌నున్న ఈ కార్య‌క్ర‌మానికి క‌రోనా అనంత‌ర ప‌రిస్థితుల నేప‌థ్యంలో రూప‌క‌ల్ప‌న జ‌రిగింది.

క‌రోనా వైర‌స్ విస్తృతి మొద‌ల‌య్యేదాకా ప్ర‌భుత్వ ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల విద్యార్థుల్లో విద్యా ప్ర‌మాణాలు బాగానే ఉండేవి. అయితే క‌రోనా ప్ర‌వేశంలో నెల‌ల త‌ర‌బ‌డి పాఠ‌శాల‌లు మూత పడడం, ఉన్న‌త త‌ర‌గతుల‌కు ఆన్‌లైన్ క్లాసులు జ‌రిగినా... ప్రాథ‌మిక విద్యార్థుల‌కు అది కూడా లేక‌పోవ‌డంతో వారు నేర్చుకున్న పాఠాల‌ను పూర్తిగా మ‌రిచిపోయారు. వీరిలో తాజాగా విద్యా ప్ర‌మాణాల‌ను పెంపొందించేందుకే తొలి మెట్టు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. 

ఈ ప‌థ‌కంలో భాగంగా ఈ ఏడాది 23 వేల ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల‌కు చెందిన 11.24 ల‌క్ష‌ల మంది చిన్నారుల‌కు క‌నీస విద్యా ప్ర‌మాణాలు పెంపొందించాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం రాష్ట్రంలోని 52 వేల పైచిలుకు ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల్లోని ఉపాధ్యాయుల‌కు మూడు విడ‌త‌ల్లో ప్ర‌త్యేక శిక్ష‌ణ‌ను ఇవ్వాల‌ని పాఠ‌శాల విద్యా శాఖ ల‌క్ష్యంగా నిర్దేశించుకుంది.

More Telugu News