Amsterdam: అమ్మాయిల కోసం, డ్రగ్స్ కోసమైతే ఇక్కడకు రావొద్దు: పర్యాటకులకు ఆమ్‌స్టర్‌డామ్ మేయర్ వినతి

  • ఆమ్‌స్టర్‌డామ్‌లో వ్యభిచారం, డ్రగ్స్ చట్టబద్ధం 
  • వీటి కోసం పోటెత్తుతున్న పర్యాటకులు
  • నైతికత కోల్పోయేందుకు రావొద్దంటున్న మేయర్
Amsterdam mayor says tourists coming for sex and drugs not welcome

ఆమ్‌స్టర్‌డ్యామ్.. నెదర్లాండ్స్ రాజధాని అయిన ఈ నగరం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎటుచూసినా అందమైన కాలువలు, అంతే సుందరమైన వీధులు, గొప్పగొప్ప మ్యూజియాలతో అలరారే ఈ నగరాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు పోటెత్తుతుంటారు.

భూతల స్వర్గంలా ఉండే ఈ నగరానికి మరో మరక కూడా ఉంది. దీనిని ‘సిటీ ఆఫ్ సిన్’ (పాపపు నగరం)గా కూడా పిలుస్తుంటారు. దీనికి ఓ కారణం ఉంది. ఇక్కడ వ్యభిచారం చట్టబద్ధమైనది. గంజాయి వాడడం కూడా నేరం కాదు. ఇక్కడ ఈ రెండూ పెద్ద ఆదాయ వనరులు. ఈ నేపథ్యంలో ఆమ్‌స్టర్‌డామ్ అందాలను ఆస్వాదించడానికే కాదు.. అమ్మాయిల పొందు కోరేందుకు, డ్రగ్స్ కోసం కూడా పర్యాటకులు ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తుంటారు.

 ఈ నేపథ్యంలో నగర మేయర్ ఎమ్కే హల్సేమా (56) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బ్లూమ్‌బర్గ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆమ్‌స్టర్‌డామ్ అందాలు చూసేందుకు, మ్యూజియంలు తిలకించేందుకు, లేదంటే ఇక్కడి సంస్కృతీసంప్రదాయల గురించి తెలుసుకునేందుకు వచ్చే పర్యాటకులను స్వాగతిస్తానని చెప్పారు.

 నైతికతతో విహార యాత్రకు వచ్చే వారిని తాము ఆహ్వానిస్తామన్న ఆమె.. ప్రజలు తమ నైతికతను కోల్పోవాలనుకుంటే మాత్రం ఇక్కడకు రావొద్దని స్పష్టంగా పేర్కొన్నారు. నగరం చాలామంది నాన్‌రెసిడెంట్‌లకు మాత్రమే వసతి కల్పిస్తోందన్న ఆమె.. వీరి కారణంగా నగర జీవనం మరింత ఖరీదైనదిగా మారుతోందన్నారు. కాబట్టి సెక్స్ కోసం, డ్రగ్స్ కోసమైతే ఇక్కడకు రావొద్దని పర్యాటకులకు ఆమె విజ్ఞప్తి చేశారు.

రాజధానిలో పర్యాటకులకు సాఫ్ట్ డ్రగ్స్ విక్రయించే కాఫీ షాపులు సర్వసాధారణం. వ్యవస్థీకృత నేరాలు, మనీలాండరింగ్‌తో ఇవి ముడిపడి ఉన్నాయి. దీంతో నేరాలు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. 2018లో హల్సేమా ఆమ్‌స్టర్‌డామ్‌కు మొదటి మహిళా మేయర్ అయినప్పటి నుంచి నగరంలోని రెడ్‌లైట్ డిస్ట్రిక్ట్‌ను మార్చేందుకు, సెక్స్ వర్కర్లను రక్షించేందుకు ఓ చట్టాన్ని ప్రతిపాదించారు. ఇందులో నగరంలోని వేశ్యాగృహాలను తగ్గించడం,  లేదంటే పూర్తిగా మూసివేయడం, లేదంటే వాటిని పూర్తిగా వేరే చోటికి తరలించడం వంటివి ఉన్నాయి.

More Telugu News