Union minister: మొక్కజొన్న పొత్తు ధర రూ.15.. విక్రయదారుతో కేంద్ర మంత్రి వాగ్వివాదం

  • మధ్యప్రదేశ్ లోని మండ్లకు వెళుతున్న క్రమంలో జరిగిన ఘటన
  • ఇంత అధిక రేటుకు విక్రయిస్తావా? అంటూ ప్రశ్న
  • బేరాలాడడంపై నెటిజన్ల విమర్శలు
For Union minister Kulaste 15 for corn is too high says

ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే. అయితేనేమి తాను కూడా సామాన్యుడినే అని నిరూపించారు. తన చర్యతో విమర్శల పాలయ్యారు. కారులో వెళుతూ రోడ్డు పక్కన విక్రయిస్తున్న మొక్కజొన్న పొత్తులను షాపింగ్ చేశారు. కారు దిగి దుకాణాదారు వద్దకు వెళ్లిన మంత్రి..   మూడు పొత్తులను కాల్పించుకుని, ఉప్పు రాయించుకున్నారు.   

ఒక్కోటీ ఎంత? అని అడిగారు. దానికి రూ.15 అంటూ విక్రయదారు నుంచి సమాధానం వచ్చింది. ‘‘మూడు కంకులకు రూ.45 రూపాయలు.. ఇంత అధిక ధరకు విక్రయిస్తావా?’’ అని ప్రశ్నించారు. దానికి దుకాణాదారు స్పందిస్తూ.. ‘‘రూ.15 అన్నది స్టాండర్డ్ ధర. కస్టమర్ కు (కులస్తేకు) కారు ఉందని చెప్పి ధరను పెంచలేదు’’ అని బదులిచ్చాడు. 

మొక్కజొన్న ఇక్కడ ఉచితంగా లభిస్తుందని తెలుసా? అని మంత్రి కులస్తే ప్రశ్నించారు. ఎన్నో ప్రశ్నల తర్వాత ఆ మొత్తం చెల్లించి వచ్చేశారు. ‘‘సియోని నుంచి మండ్లకు వెళుతున్నాను. స్థానిక మొక్కజొన్నను రుచి చూశాను. స్థానిక రైతుల నుంచి, స్థానిక వ్యాపారుల నుంచే అన్ని ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. ఇది వారికి ఉపాధి కల్పిస్తుంది’’ అని మంత్రి ట్వీట్ చేశారు. 

కానీ మొక్క జొన్న కోసం మంత్రి బేరాలాడిన తీరును నెటిజన్లు విమర్శిస్తున్నారు. మంత్రికి పెరిగిన ధరల మంట తెలిసొచ్చిందన్న కామెంట్లు కూడా కనిపించాయి.

More Telugu News