KTR: ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక నిధులపై కిషన్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదు: కేటీఆర్

KTR fires on Kishan Reddy over SRDF and NDRF funds
  • కేంద్రం నుంచి తెలంగాణకు వస్తున్నదేమీ లేదన్న కేటీఆర్
  • నిత్యానంద రాయ్ ప్రకటన ఉదహరించిన వైనం
  • కిషన్ రెడ్డికి ఎన్డీఆర్ఎఫ్ కు, ఎస్డీఆర్ఎఫ్ కు తేడా తెలియదని ఎద్దేవా
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక నిధులపై కిషన్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా దక్కే ఎస్డీఆర్ఎఫ్ నిధుల గణాంకాల పేరుతో కిషన్ రెడ్డి అయోమయానికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. 

విపత్తులతో పనిలేకుండా ఎస్డీఆర్ఎఫ్ నిధులు వస్తాయని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ ఈ నిధులను కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చినట్టు కిషన్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎన్డీఆర్ఎఫ్ కు, ఎస్డీఆర్ఎఫ్ కు తేడా తెలియని వ్యక్తి కేంద్రమంత్రిగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఓ హక్కుగా లభిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ నిధులు తప్ప కేంద్రం నుంచి తెలంగాణకు ఇస్తున్నదేంటో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. 

గుజరాత్ లో వరదలు వస్తే ప్రధానమంత్రి వెంటనే సర్వే చేపట్టి రూ.1000 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక అదనపు సాయాన్ని అందించారని చెబుతూ.. మరి, తెలంగాణ ప్రజల కష్టాలు మోదీకి కనిపించవా? అని ప్రశ్నించారు. 

నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలకు రూ.15,270 కోట్లు ఇచ్చారని, తెలంగాణకు ఇవ్వడానికి మాత్రం మనసొప్పడం లేదని కేటీఆర్ విమర్శించారు. 2018 తర్వాత తెలంగాణకు ఏమీ ఇవ్వలేదన్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ చేసిన ప్రకటనను కిషన్ రెడ్డి చదవాలని హితవు పలికారు.
KTR
Kishan Reddy
SDRF
NDRF

More Telugu News