Andhra Pradesh: ఈ ఏడాది మార్చి నాటికి ఏపీ మొత్తం అప్పులు రూ.4,98,799 కోట్లు: సీఎం ప్ర‌త్యేక కార్య‌దర్శి కృష్ణ‌

  • 2021-22 ఏడాదిలో ఏపీ అప్పులు రూ.25,194 కోట్ల మేర త‌గ్గాయ‌న్న కృష్ణ‌
  • కేంద్రం త‌న అప్పుల‌ను కూడా చెప్పాల‌ని డిమాండ్‌
  • ఉచిత ప‌థ‌కాల‌ను కేంద్రం ఆర్థిక కోణంలో చూస్తోంద‌ని ఆరోప‌ణ‌
  • ఏపీ మాత్రం సామాజిక పెట్టుబ‌డి కోణంలో ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తోంద‌ని వెల్ల‌డి
ap cm special secretary duvvuri krishna comments on ap debt

ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతోంద‌న్న వాద‌న‌ల నేప‌థ్యంలో రాష్ట్రం ఈ ఏడాది దాకా చేసిన మొత్తం అప్పుల విలువ ఎంత? అప్పుల‌ను వైసీపీ ప్ర‌భుత్వం ఏ మేర‌కు త‌గ్గించింది? అన్న వివ‌రాల‌పై సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్న దువ్వూరి కృష్ణ గురువారం స్ప‌ష్ట‌తనిచ్చారు. 2022 ఏడాది మార్చి నాటికి ఏపీ మొత్తం అప్పులు రూ.4,98,799 కోట్ల‌కు చేరుకున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. అదే స‌మ‌యంలో ఏపీ అప్పుల‌ను 2021-22 ఏడాదిలో రూ.25,194 కోట్ల మేర త‌గ్గించిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. 

ఏపీ స‌హా ప‌లు రాష్ట్రాల అప్పుల‌ను ఇటీవ‌లే ప్ర‌స్తావించిన కేంద్ర ప్ర‌భుత్వంపై కృష్ణ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రాల అప్పుల‌ను ప్ర‌స్తావించేట‌ప్పుడు కేంద్రం త‌న అప్పుల‌ను కూడా చెప్పాల‌ని ఆయ‌న అన్నారు. 2019-20లో కేంద్రం అప్పులు దేశ జీడీపీలో 50.90 శాతానికి చేరాయ‌న్న ఆయ‌న‌.. ఏడాదిలోనే కేంద్రం రూ.1,02,19,067 కోట్ల మేర అప్పులు చేసింద‌ని వెల్ల‌డించారు. 2021-22 లో కేంద్రం అప్పులు రూ.1.35 ల‌క్ష‌ల కోట్ల మేర పెరిగాయ‌ని ఆయ‌న తెలిపారు. 2013-20లో ఏపీ ద్ర‌వ్య‌లోటు రూ.39,683 కోట్లుగా ఉంద‌ని కృష్ణ తెలిపారు. ఉచిత ప‌థ‌కాల‌ను కేంద్రం ఆర్థిక కోణంలో చూస్తోంద‌న్న కృష్ణ‌.. ఏపీ మాత్రం ఆ ప‌థ‌కాల‌ను సామాజిక పెట్టుబ‌డి కోణంలో చూస్తోంద‌ని తెలిపారు.

More Telugu News