Team India: టీమిండియా ఆటగాళ్లు వెస్టిండీస్ వెళ్లేందుకు రూ.3.5 కోట్లతో ప్రత్యేక విమానం... ఎందుకంటే...!

BCCI arranged special plane for Team India contingent travel to West Indies
  • ఇంగ్లండ్ లో ముగిసిన టీమిండియా పర్యటన
  • మాంచెస్టర్ నుంచి వెస్టిండీస్ పయనం
  • పోర్ట్ ఆఫ్ స్పెయిన్ చేరుకున్న భారత ఆటగాళ్లు
  • చార్టర్డ్ విమానం ఏర్పాటు చేసిన బీసీసీఐ
ఇటీవలే ఇంగ్లండ్ పర్యటన ముగించుకున్న టీమిండియా ఆటగాళ్లు వెస్టిండీస్ పర్యటనకు తరలి వెళ్లారు. ఈ పర్యటనలో భారత జట్టు వెస్టిండీస్ తో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లు ఆడుతుంది. ఇంగ్లండ్ తో మాంచెస్టర్ లో చివరి వన్డే ముగిసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు అట్నుంచి అటే వెస్టిండీస్ పయనమయ్యారు. 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... భారత ఆటగాళ్లను వెస్టిండీస్ తీసుకెళ్లేందుకు బీసీసీఐ రూ.3.5 కోట్లతో చార్టర్డ్ విమానం ఏర్పాటు చేసింది. కరోనా వ్యాపిస్తుందేమోనన్న భయంతో ఈ నిర్ణయం తీసుకోలేదు. పెద్ద సంఖ్యలో ఉన్న ఆటగాళ్లను, వారిలో కొందరి భార్యాబిడ్డలను, సహాయక బృందాన్ని కరీబియన్ దీవులకు తీసుకెళ్లాలంటే పలు విమానాల్లో టికెట్లు బుక్ చేయాల్సి ఉంటుంది. తక్కువ సమయంలో అంతమందికి ఒకేసారి టికెట్లు బుక్ చేయడం కష్టమైన వ్యవహారం కావడంతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం మేలని బీసీసీఐ నిర్ణయించింది. 

క్రికెట్ ఆడే దేశాల్లో అంత్యంత సంపన్న బోర్డు బీసీసీఐ ఈ విషయంలో వెనుకంజ వేయలేదు. ఏమాత్రం ఆలోచించకుండా చార్టర్డ్ ప్లేన్ ను బుక్ చేసి ఆటగాళ్లను మాంచెస్టర్ నుంచి వెస్టిండీస్ లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ కు తరలించింది. 

సాధారణ విమానాల్లో అయితే రూ.2 కోట్లు ఖర్చవుతుందని, అయితే జట్టు అంతటినీ ఒకేసారి తరలించడానికి చార్టర్డ్ ఫ్లయిట్ సరైన ఎంపిక అని బీసీసీఐ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అగ్రశ్రేణి ఫుట్ బాల్ జట్లు ఇప్పుడు చార్టర్డ్ విమానాల్లోనే ప్రయాణిస్తున్నాయని తెలిపారు.
Team India
Chartered Flight
Manchester
Port Of Spain
West Indies
BCCI
India

More Telugu News