Doklam: ఏమాత్రం తగ్గని డ్రాగన్... భారత సరిహద్దుల్లో మరో గ్రామం నిర్మాణం

China constructs another village near Doklam
  • అమో చు నదీతీరంలో చైనా కృత్రిమ గ్రామాలు
  • తాజాగా గ్రామంలోని ఇళ్ల వద్ద కార్లు పార్క్ చేసి ఉన్న దృశ్యం
  • ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడి
  • నిశితంగా గమనిస్తున్నామన్న సైన్యం
ఐదేళ్ల కిందట భారత్, చైనా బలగాలు సరిహద్దులకు సమీపంలోని డోక్లామ్ పీఠభూమి వద్ద ఘర్షణ పడడం తెలిసిందే. చైనా అక్కడో గ్రామం నిర్మించింది. తాజాగా వెల్లడైన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో చైనా అక్కడ రెండో గ్రామాన్ని పూర్తిగా నిర్మించినట్టు స్పష్టమైంది. అంతేకాదు, చైనా అదే ఊపులో మూడో గ్రామాన్ని కూడా నిర్మిస్తోన్న విషయం తేటతెల్లమైంది. 

డోక్లామ్ పీఠభూమికి తూర్పు దిశలో 9 కిమీ దూరంలో ఈ నూతన గ్రామం దర్శనమిచ్చింది. ఇలాంటి కృత్రిమ గ్రామాలను చైనా పంగ్డా అని పిలుస్తోంది. ఇప్పుడీ నూతన పంగ్డాలో ఉన్న ఇళ్ల ముందు కార్లు కూడా పార్క్ చేసి ఉండడం ఉపగ్రహ చిత్రాల్లో కనిపించింది. భూటాన్ నుంచి చేజిక్కించుకున్న భూభాగంలో అమో-చు నదీ తీరంలో ఈ గ్రామాలను చైనా ఏర్పాటు చేసింది. 

ఈ నిర్మాణాలతో డోక్లామ్ పీఠభూమిలోని వ్యూహాత్మక భాగాలపై చైనా బలగాలు పట్టు సాధించేందుకు మార్గం సుగమం అవుతుంది. అంతేకాదు, భారత్ కు చెందిన సున్నితమైన సిలిగురి కారిడార్ కు చైనా బలగాలు చేరుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగతా భూభాగంతో అనుసంధానించేది ఈ కారిడారే. 

దీనిపై సైనిక వర్గాలు స్పందించాయి. సరిహద్దుల వెంబడి కార్యకలాపాలపై సైన్యం నిరంతరాయంగా నిఘా వేసి ఉంచుతుందని వెల్లడించాయి. దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎలాంటి ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సైనిక వ్యవస్థలు, రక్షణ యంత్రాంగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
Doklam
Village
Border
India
China

More Telugu News