Andhra Pradesh: ఏపీకి ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయం... మ‌రోసారి తేల్చి చెప్పిన కేంద్రం

  • గ‌తంలో చెప్పిన విష‌యాలే చెప్పిన నిత్యానంద‌రాయ్‌
  • ప్ర‌త్యేక హోదాపై ప్ర‌శ్న వేసిన టీడీపీ ఎంపీ కింజ‌రాపు
  • 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌న్న కేంద్ర మంత్రి
  • రెవెన్యూ లోటు రాష్ట్రాల‌కు అద‌న‌పు నిధులు ఇచ్చామ‌ని వెల్ల‌డి
union miniter Nityanand Rai states that special category status in closed issue

ఏపీకి ప్ర‌త్యేక హోదాకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం పాత పాట‌నే పాడింది. గ‌తంలో చెప్పిన మాదిరే ఏపీకి ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయ‌మేన‌ని లోక్ స‌భ వేదిక‌గా కేంద్రం మంగ‌ళ‌వారం మ‌రోమారు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు టీడీపీ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి నిత్యానంద‌రాయ్ లోక్ స‌భ‌లో స‌మాధానం ఇచ్చారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో గ‌తంలో ఏ విష‌యాలైతే కేంద్రం చెప్పిందో... మంగ‌ళ‌వారం నాటి స‌మాధానంలో నిత్యానంద‌రాయ్ అవే విష‌యాల‌ను ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. 

ఏపీకే కాకుండా ఏ రాష్ట్రానికి కూడా ప్ర‌త్యేక హోదా ఇచ్చే విష‌యంపై 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని మంత్రి నిత్యానంద‌రాయ్ వెల్ల‌డించారు. ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా కేంద్రం ప‌న్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతానికి పెంచిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. రెవెన్యూ లోటు రాష్ట్రాల‌కు అద‌న‌పు నిధులు కేటాయించిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. 

15వ ఆర్థిక సంఘం కూడా అవే సిఫార‌సుల‌ను కొన‌సాగించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. విభ‌జ‌న చ‌ట్టంలోని చాలా హామీల‌ను నెర‌వేర్చామ‌న్న కేంద్ర మంత్రి... విభ‌జ‌న చ‌ట్టంలోని కొన్ని హామీలు మాత్ర‌మే పెండింగ్‌లో ఉన్నాయ‌ని అన్నారు. వివాదాల ప‌రిష్కారానికి రెండు రాష్ట్రాల‌తో ఇప్ప‌టిదాకా 28 సార్లు భేటీ అయిన‌ట్లు నిత్యానంద‌రాయ్ తెలిపారు.

More Telugu News