CM Jagan: వాళ్లు సంతోషంతో చెప్పే మాటలే మాకు ఆక్సిజన్: సీఎం జగన్

  • పథకాలు అందని వారికి మరో అవకాశం
  • నూతన లబ్దిదారుల జాబితా తయారు
  • కొత్త లబ్దిదారులకు నిధులు విడుదల చేసిన సీఎం జగన్
  • గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి తేడా గమనించాలని వెల్లడి
CM Jagan releases funds to new beneficiaries

అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందనివారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే లబ్ది చేకూరేలా ఏపీ ప్రభుత్వం కొత్త కార్యాచరణ తీసుకురావడం తెలిసిందే. దీనిప్రకారం సంక్షేమ పథకాలకు కొత్తగా అర్హులైన వారికి సీఎం జగన్ నేడు నిధులు విడుదల చేశారు. కంప్యూటర్ బటన్ నొక్కి 3.40 లక్షల మంది నూతన లబ్దిదారుల ఖాతాల్లోకి రూ.137 కోట్ల మేర నిధులు విడుదల చేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కోల్పోరాదన్న ఉద్దేశంతో అర్హులైన లబ్దిదారులను గుర్తించి నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. అర్హత ఉన్నవాళ్లు పథకాలకు దూరం కాకూడదని భావించి తమ ప్రభుత్వం పడుతున్న తాపత్రయానికి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం ఒక నిదర్శనం అని పేర్కొన్నారు. కులం, మతం, వర్గం, పార్టీ చూసుకోకుండా పథకాలను ఇంటివద్దకే అందిస్తున్నామని, తద్వారా 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం ద్వారా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నామని చెప్పారు. 

గత ప్రభుత్వం పథకాలను ఎలా కత్తిరించాలి? ఎలా కోత విధించాలి? అని ఆలోచించేదని, ప్రజలను పార్టీల వారీగా, కులాల వారీగా విభజించి, కొందరు వ్యతిరేకులని, జన్మభూమి కమిటీలకు ముడుపులు చెల్లించలేదని, గ్రామాల్లో కోటాకు మించి ఇవ్వలేమని పలు విధాలుగా పథకాలు ఎగ్గొట్టేవారని సీఎం జగన్ వివరించారు. 

గత ప్రభుత్వంలో లంచాలు ఇస్తేనే ప్రభుత్వ పథకాలు అందేవని, ఇప్పుడా పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఇప్పటి పాలనలో మనసు ఉందని స్పష్టం చేశారు. తాము అన్నింటికీ అతీతంగా, కుల, మత, వర్గ, రాజకీయాలు చూడకుండా ప్రజలకు లబ్దిచేకూర్చుతున్నామని వివరించారు. 

ఇవాళ పేదలను వెదుక్కుంటూ సంక్షేమపథకాలు లబ్దిదారుల ఇళ్ల తలుపులు తడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ప్రజలు సంతోషంతో చెప్పే మాటలే తమ ప్రభుత్వానికి ఆక్సిజన్ అని సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నవారికి విశ్వసనీయత, వ్యక్తిత్వం ఉండాలని, ఇవన్నీ ఉంటేనే సుపరిపాలన కనిపిస్తుందని ఉద్ఘాటించారు. దేవుని కృపతో ఇవాళ రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇంకా మేలు చేసేందుకు దేవుడు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.

More Telugu News