President Of India: ముగిసిన రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌... 21న ఓట్ల లెక్కింపు

  • ఈ నెల 21న వెల్ల‌డి కానున్న ఫ‌లితం
  • ఈ నెల 25న కొత్త రాష్ట్రపతి పదవీ ప్ర‌మాణం 
  • బ‌రిలో ద్రౌప‌ది ముర్ము, య‌శ్వంత్ సిన్హా
polling of president of india election concludes

భార‌త నూత‌న రాష్ట్రప‌తి కోసం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో భాగంగా కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ సోమ‌వారం సాయంత్రం 5 గంట‌ల‌కు ముగిసింది. నేటి ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్‌ను స‌రిగ్గా 5 గంట‌ల‌కు అధికారులు ముగించారు. పోలింగ్ ప్రారంభ‌మైన తొలి నిమిషంలోనే ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌హా ప‌లు రాష్ట్రాల సీఎంలు, ఆయా పార్టీల కీల‌క నేత‌లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని పార్ల‌మెంటు భ‌వ‌నంలో ఎంపీల‌కు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

ఇక ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ నెల 21న వెల్ల‌డి కానున్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సుల‌ను ఢిల్లీకి త‌ర‌లించిన తర్వాత ఈ నెల 21న ఓట్ల లెక్కింపును చేప‌ట్ట‌నున్న అధికారులు... అదే రోజు ఫ‌లితాన్ని ప్ర‌క‌టించ‌నున్నారు. నూత‌న రాష్ట్రప‌తిగా ఎన్నిక కానున్న అభ్యర్థి ఈ నెల 25న భార‌త రాష్ట్ర‌ప‌తిగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేస్తారు. సోమ‌వారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము, విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా బ‌రిలో నిలిచిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News