Supreme Court: రాష్ట్రాలు హిందువులకు మైనారిటీ హోదా నిరాకరిస్తున్నాయనడానికి గట్టి ఆధారాలు కావాలి: సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

Supreme Court wants firm examples on states being denied minarity status ti Hindus
  • హిందువులకు మైనారిటీ హోదా కావాలంటూ పిటిషన్
  • సుప్రీంను ఆశ్రయించిన ఆధ్యాత్మికవేత్త దేవకీనందన్ ఠాకూర్
  • నిదర్శనాలు చూపాలన్న సుప్రీంకోర్టు
  • బలమైన కేసు ఉంటేనే జోక్యం చేసుకోగలమని స్పష్టీకరణ
హిందూ ఆధ్యాత్మిక నేత దేవకీనందన్ ఠాకూర్ దాఖలు చేసిన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జాతీయస్థాయిలో ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్శీలు, సిక్కులు, జైనులు మైనారిటీలుగా ఉన్నారని, మరి హిందువులకు ఎందుకు మైనారిటీ హోదా ఇవ్వరని దేవకీనందన్ ఠాకూర్ తన పిటిషన్ లో ప్రశ్నించారు. మైనారిటీలను గుర్తించడం అన్నది రాష్ట్రాల బాధ్యత అని, కానీ రాష్ట్రాలు హిందువులకు మైనారిటీ హోదా నిరాకరిస్తున్నాయని పిటిషనర్ దేవకీనందన్ ఠాకూర్ తరఫు న్యాయవాది అరవింద్ దతార్ పేర్కొన్నారు. ఈ మేరకు జాతీయ మైనారిటీల చట్టంలోని సెక్షన్ 2(సీ)ని తమ పిటిషన్ లో సవాల్ చేశారు. 

1993 నోటిఫికేషన్ ప్రకారం 6 వర్గాలను మైనారిటీలుగా పేర్కొంటున్నప్పుడు, హిందువులు మైనారిటీలు కాలేరా? అని అరవింద్ దతార్ ప్రశ్నించారు. అంతేకాదు, జిల్లాల వారీగా మైనారిటీల గుర్తింపు, రాష్ట్రాల వారీగా వారి హోదా వివరాలను కూడా తమ పిటిషన్ లో కోరారు.  

దీనిపై  జస్టిస్ యు.యు. లలిత్ ధర్మాసనం తమ వైఖరి వెల్లడించింది. రాష్ట్రాలు హిందువులకు మైనారిటీ హోదా నిరాకరిస్తున్నాయనడానికి గట్టి ఆధారాలు కావాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఏవైనా నిదర్శనాలు ఉంటే చూపండి అని పిటిషనర్ కు సూచించింది. కశ్మీర్ లోనో, లేక మిజోరంలోనో హిందువులకు మైనారిటీ హోదా నిరాకరిస్తున్నారంటూ ఏదైనా బలమైన కేసు ఉంటే తప్ప దీనిపై తాము జోక్యం చేసుకోబోమని వెల్లడించింది. అంతేకాకుండా, రాష్ట్రాల వారీగా మైనారిటీలకు సంబంధించిన వివాదాలపైనా విచారణ చేపట్టబోమని తెలిపింది. 

గతంలోనూ ఇలాంటి పిటిషన్ విచారణకు రాగా, రాష్ట్రాల స్థాయిలో దీనికి సంబంధించి తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇటీవలే కేంద్రం కూడా మైనారిటీల గుర్తింపునకు సంబంధించి విస్పష్టంగా వ్యాఖ్యానించింది. ఓ వర్గాన్ని మైనారిటీలుగా గుర్తించే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉందని, అయితే రాష్ట్రాలు, ఇతర సంబంధిత వర్గాలతో సంప్రదింపులు, చర్చల తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవడం జరుగుతుందని వివరించింది. 

కాగా, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ గతంలో వ్యాఖ్యానిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలోని ఏవైనా మత, భాషా వర్గాలను మైనారిటీలుగా ప్రకటించవచ్చని పేర్కొంది.
Supreme Court
Minarity
Hindus
States
India

More Telugu News