TDP: హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, గౌతం గంభీర్‌ల మ‌ధ్య‌లో రామ్మోహ‌న్ నాయుడు!.. పార్ల‌మెంటులో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం!

  • ఇటీవ‌లే రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన హ‌ర్భ‌జ‌న్ సింగ్‌
  • ఇప్ప‌టికే బీజేపీ ఎంపీగా కొన‌సాగుతున్న గౌతం గంభీర్‌
  • వారిద్ద‌రితో క‌లిసి ఫొటో దిగిన రామ్మోహ‌న్ నాయుడు
  • రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర స‌న్నివేశం
tdp mp ram mohan naidu snap with ex cricketers and mps gautam gambhir and harbhajan singh

పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల ప్రారంభం, రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌ల నేప‌థ్యంలో సోమ‌వారం పార్ల‌మెంటు హాల్ సంద‌డిగా క‌నిపించింది. అంతేకాకుండా ఇటీవ‌లే రాజ్య‌స‌భ‌కు కొత్త‌గా ఎన్నికైన స‌భ్యులు కూడా పార్ల‌మెంటుకు రావడంతో పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో ప‌లు కొత్త ముఖాలు క‌నిపించాయి. ఈ సంద‌ర్భంగా టీడీపీ యువ నేత, శ్రీకాకుళం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు ఇద్ద‌రు యువ ఎంపీల‌తో క‌లిసి దిగిన ఫొటోను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు.

ఈ ఫొటోలో ఇప్ప‌టికే బీజేపీ త‌ర‌ఫున ఢిల్లీ నుంచి ఎంపీగా కొన‌సాగుతున్న మాజీ క్రికెట‌ర్ గౌతం గంభీర్‌, ఇటీవ‌లే పంజాబ్ కోటాలో ఆమ్ ఆద్మీ పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన మ‌రో మాజీ క్రికెటర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌లు రామ్మోహ‌న్ నాయుడుకు చెరోవైపు కూర్చున్నారు. హ‌ర్భ‌జ‌న్ సింగ్‌ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా సోమవారం ప్ర‌మాణం కూడా చేశారు. అనంత‌రం రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా ఇద్ద‌రు మాజీ క్రికెట‌ర్ల‌తో టీడీపీ ఎంపీ ఫొటో దిగారు.

ఈ ఫొటోను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్న రామ్మోహ‌న్ నాయుడు... త‌న‌కిరువైపులా కూర్చున్న ఇద్ద‌రు మాజీ క్రికెటర్ల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గౌతం గంభీర్ ఇప్ప‌టికే పొలిటిక‌ల్ కెరీర్ ప్రారంభించ‌గా... హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఇప్పుడే రాజ‌కీయ జీవితం ప్రారంభించార‌ని ఆయ‌న చెప్పారు. పార్ల‌మెంటు అనేది దేశ స‌మ్మిళిత స‌మూహానికి ప్ర‌తీక అని పేర్కొన్న టీడీపీ ఎంపీ... ఇక్క‌డ అన్ని ప్రాంతాలు, మ‌తాలు, వర్గాలకు చెందిన వారు ఉంటార‌ని పేర్కొన్నారు.

More Telugu News