India: భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ఎందుకు వాడతారంటే..!

Why ballot papers are using in Indian presidential elections
  • ఈవీఎంలలో కేవలం ఒక్కరికి మాత్రమే ఓటు వేసే అవకాశం
  • రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రాధాన్యతా పద్ధతిలో ఓట్లు వేసే అవకాశం
  • ఓటర్లు ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటు వేయవచ్చు
  • ప్రాధాన్యతా ఓట్లు ఎక్కువ వచ్చిన వారే విజేత
  • రాష్ట్రపతి ఎన్నికల విధానానికి సెట్ కాని ఈవీఎంలు
ఎన్నికలు అనగానే మనకు ఈవీఎంలే గుర్తుకు వస్తాయి. లోక్ సభ ఎన్నికల్లో కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మనం ఈవీఎంల ద్వారానే ఓటు వేస్తున్నాం. 2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన 4 లోక్ సభ ఎన్నికలు, దేశ వ్యాప్తంగా జరిగిన 127 వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ ఈవీఎంల ద్వారానే ఓటు వేశారు. 

అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఈవీఎంలు వాడరు. బ్యాలెట్ పేపర్ విధానం ద్వారానే దేశ ప్రథమ పౌరుడి ఎన్నిక జరుగుతోంది. అన్ని ఎన్నికలకు ఈవీఎంలు వాడుతున్నప్పుడు... రాష్ట్రపతి ఎన్నికలను మాత్రం బ్యాలెట్ విధానం ద్వారా ఎందుకు నిర్వహిస్తున్నారనే ప్రశ్న చాలా మందిలో ఉంది. దీనికి కారణం తెలుసుకుందాం. 

ఈవీఎంలు పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన పరికరాలు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వీటిని ఉపయోగిస్తున్నారు. ఈవీఎంలలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు, దాని పక్కన బటన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఓటర్లు తమకు ఇష్టమైన అభ్యర్థి పక్కనున్న బటన్ ను ప్రెస్ చేసి ఓటు వేస్తారు. ఈవీఎంలలో కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఒకసారి బటన్ ప్రెస్ చేయగానే, మనం ఓటు వేసే కార్యక్రమం పూర్తయిపోతుంది. కౌంటింగ్ రోజున ఈవీఎంను ఓపెన్ చేసి ఓట్లను లెక్కిస్తారు. ఇందులో ఉన్న సాఫ్ట్ వేర్ ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనే విషయాన్ని క్షణాల్లో చూపించేస్తుంది. 

రాష్ట్రపతి ఎన్నికల విషయానికి వచ్చేసరికి... దీని పోలింగ్ విధానానికి ఈవీఎంలు ఏ మాత్రం సరిపోవు. ఎందుకంటే ఓటు వేసే వారికి కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలనే నిబంధన ఇక్కడ ఉండదు. ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులకు తమ ఛాయిస్ ఆధారంగా ప్రిఫరెన్సియల్ (ప్రాధాన్యత పద్ధతిలో) ఓట్లు వేసే అవకాశం ఇక్కడ ఉంటుంది. 

ఓటర్లు వారి ప్రాధాన్యతల ఆధారంగా, వారి ఇష్టానుసారం ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటు వేయవచ్చు. చివరకు 50 శాతం కంటే ఎక్కువ ప్రాధాన్యత ఓట్లు పడిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరూ గెలవకపోతే, రెండో ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థులకు బదిలీ చేస్తారు. ఆ విధంగా ఒక అభ్యర్థికి 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చే వరకూ ఈ ప్రాధాన్యత ఓట్ల బదిలీ కొనసాగుతుంది. రాష్ట్రపతి ఎన్నికతో పాటు, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ్య సభ్యులు, రాష్ట్ర ఎమ్మెల్సీల ఎన్నికలు కూడా ఇదే పద్ధతిలో నిర్వహిస్తారు.  

ఒకరి కంటే ఎక్కువ మందికి ప్రిఫరెన్సియల్ ఓట్లు వేసే అవకాశం ఉండటంతో... ఈవీఎంలు ఈ ఎన్నికలకు ఉపయోగపడవు. అందువల్లే రాష్ట్రపతి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తారు. బ్యాలెట్ పేపర్లోని కాలమ్ 2 లో మన ఇష్టాన్ని బట్టి 1, 2, 3, 4, 5, ...... ఇలా ఎంతమందికైనా ఓటు వేయవచ్చు. ఈవీఎంలో కేవలం ఒక్కరికి మాత్రమే ఓటు వేయగలం. ఈ కారణంగానే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడం లేదు. ఒకవేళ ఈ ఎన్నికల్లో కూడా ఈవీఎంలను వాడాలనుకుంటే... ప్రిఫరెన్సియల్ ఓట్లన్నింటినీ కూడా లెక్కించేలా ఈవీఎంల టెక్నాలజీని పూర్తిగా మార్చాల్సి ఉంటుంది.
India
President Of India
Presidential Elections
Ballot
EVM

More Telugu News