Telangana: వరద బాధితుల సహాయం కోసం వార్ రూమ్ ను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 24 గంటలు పని చేయనున్న వార్ రూమ్
  • 90302-27324, 040-24651119 హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు
  • పలు జిల్లాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్న ఆరోగ్య శాఖ
War room set up in Telangana to attend flood emergency calls

రాష్ట్రంలో వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ఆరోగ్య శాఖ, 24 గంటలూ పనిచేసే వార్‌రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం 90302 27324, 040-24651119 హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎనిమిది జిల్లాల్లోని నీట మునిగిన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలను ఆరోగ్య బృందాలు అందిస్తున్నాయి. 

ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ జిల్లాల్లో ప్రజారోగ్య పరిరక్షణ చర్యలను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక వార్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వార్ రూమ్ హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసి ప్రజలు సహాయం పొందవచ్చని వైద్య శాఖ అధికారులు తెలిపారు.

ప్రభావిత జిల్లాల్లో జిల్లా, డివిజన్ స్థాయిల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజల సహాయార్ధం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల వైద్య యంత్రాంగాలకు నిర్దేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 

మరోపక్క, ఇప్పటికే పలు జిల్లాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో 24,674 మంది వ్యక్తులు చికిత్స పొందారు. వారిలో 25 మందిని ఉన్నత ఆరోగ్య కేంద్రాలకు రిఫర్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో అత్యధికంగా క్యాంపులు ఏర్పాటు చేశారు. విపరీతమైన జ్వరం, తలనొప్పి, వికారం, కళ్లు ఎర్రబడడం, విరేచనాలు వంటి లక్షణాలు ఉన్నవారు తమ సమీప ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావు కోరారు.

More Telugu News