Monkeypox Virus: దుబాయ్ నుంచి విజయవాడ వచ్చిన చిన్నారికి మంకీ పాక్స్ లక్షణాలు.. అప్రమత్తమైన అధికారులు!

monkeypox suspected case in vijayawada
  • దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత చిన్నారి శరీరంపై దద్దుర్లు, జ్వరం
  • నమూనాలు సేకరించి పుణె వైరాలజీ ల్యాబ్ కు పంపిన వైద్యులు
  • నివేదిక వచ్చాక మంకీ పాక్స్ సోకిందా, మరేదైనా వైరస్ సోకిందా అనేది నిర్ధారణ అవుతుందని వెల్లడి
ఏపీలోని విజయవాడలో రెండేళ్ల వయసున్న చిన్నారిలో మంకీ పాక్స్ లక్షణాలు కనిపించడం కలకలం రేపింది. ఇటీవలే ఆ చిన్నారి కుటుంబం దుబాయ్ నుంచి విజయవాడకు వచ్చింది. ఆమె ఒంటిపై ఓ రకమైన దద్దుర్లు, జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారి చర్మంపై దద్దుర్లను, ఇతర లక్షణాలను పరిశీలించిన వైద్యులు.. అవి మంకీ పాక్స్ లక్షణాల తరహాలో కనిపించడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే కుటుంబం మొత్తాన్ని ఐసోలేషన్ కు తరలించారు.

విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారిని ఉంచి చికిత్స అందజేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. చిన్నారి నుంచి నమూనాలు సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించినట్టు వెల్లడించాయి. చిన్నారికి సోకినది మంకీ పాక్స్ వైరసా, మరేదైనా అయి ఉంటుందా అన్నది ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాతే నిర్ధారణ అవుతుందని తెలిపాయి. అయితే ఈ అంశంపై అధికారికంగా స్పందించేందుకు నిరాకరించాయి. 

వేగంగా విస్తరిస్తూ భయపెడుతున్న మంకీ పాక్స్
  • ఆఫ్రికాలో మొదట బయటపడిన మంకీ పాక్స్ వైరస్ ఇప్పటివరకు సుమారు 60 దేశాలకు విస్తరించింది. ఆఫ్రికాతోపాటు యూరప్ లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల మన దేశంలోని కేరళలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైంది.
  • మంకీ పాక్స్ వైరస్ సోకినవారికి ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు ఏర్పడుతాయి. జ్వరం, తలనొప్పి, నడుమునొప్పి, తీవ్రమైన నీరసం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఈ వ్యాధి సోకినవారిలో చాలా మంది సులువుగానే కోలుకుంటారు. కొందరిలో మాత్రం ప్రాణాపాయం తలెత్తే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.
Monkeypox Virus
Vijayawada
Andhra Pradesh

More Telugu News