Telangana: గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వరదల వెనుక కుట్ర కోణం ఉండొచ్చని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

  • ఈ మధ్య క్లౌడ్ బరస్ట్ లతో  ఇతర దేశాల వాళ్లు కుట్ర చేస్తున్నారన్న సీఎం
  • కశ్మీర్, లేహ్ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ చేశారని చర్చ జరుగుతుందని వ్యాఖ్య
  • దీనిపై పూర్తి వాస్తవాలు బయటకు రావాలన్న ముఖ్యమంత్రి
May be a conspiracy of other countries behind the heavy floods in the Godavari basin says CM KCR

దేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం వెనుక కుట్ర కోణం ఉండొచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య దేశంలోని కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్  (ఒక్కసారిగా భారీ వర్షాలు పడటం) జరుగుతున్నాయన్నారు. ఇది వరకు కశ్మీర్, లేహ్ ప్రాంతాల్లో ఇలానే క్లౌడ్ బరస్ట్ తో వరదలు సృష్టించేందుకు ఇతర దేశాల నుంచి  కుట్ర జరిగినట్టు ప్రచారం జరిగిందన్నారు. 

ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ క్లౌడ్ బరస్ట్ చేశారనే అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. దీనిపై పూర్తి వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భద్రాచలంలో గోదావరి వరద బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వేను రద్దు చేసుకున్న సీఎం కేసీఆర్ ములుగు, ఏటూరునాగారం మీదుగా వరద పరిస్థితులను వీక్షిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు.

More Telugu News