YSRCP: చంద్రబాబు వరసకు నాకు అన్న అవుతారు.. ఆయన ఆస్తులన్నీ నావే అవుతాయా?: విజయసాయి రెడ్డి

YCP MP Vijaya sai reddy slams CBN and Lokesh over adaan company
  • అడాన్ కంపెనీతో తమ కుంటుబానికి సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారన్న ఎంపీ
  • రాజకీయంగా ఎదుర్కోలేకే బాబు, లోకేశ్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
  • ఆధారాలతో దీన్ని తిప్పికొడతానన్న విజయసాయి రెడ్డి
రాజకీయంగా ఎదుర్కోలేకే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయ‌న కుమారుడు లోకేశ్ త‌న‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అడాన్ కంపెనీతో తమ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తగిన ఆధారాల‌తో ఈ దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టే సామ‌ర్థ్యం త‌న‌కు ఉంద‌న్నారు. 

ఇప్పటిదాకా నారా, నంద‌మూరి కుటుంబాల గురించి తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదన్న ఆయన పరిధి దాటొద్దని చంద్రబాబు, లోకేశ్ లను హెచ్చరించారు. అస‌భ్య పదజాలాన్ని వాడాలంటే వారిద్దరికంటే తాను పదింతలు ఎక్కువ ఉపయోగించాల్సి వస్తుందన్నారు.  

శనివారం ఉదయం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... అడాన్‌ కంపెనీపై చంద్రబాబుతో పాటు టీడీపీ దుష్ర్పచారం చేస్తోందన్నారు. తమ కుటుంబానికి అడాన్‌ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

‘చంద్రబాబుకు చెందిన ఇతర కంపెనీల్లో అవినీతి జరిగింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌లో వడ్లమూడి నాగరాజు డైరెక్టర్‌గా ఉన్నారు. చంద్రబాబు కుటుంబానికి కూడా ఆ కంపెనీలతో సంబంధం ఉన్నట్టేనా? కార్పొరేట్‌ రంగంలో చంద్రబాబుకు ఉన్న చర్రిత మరెవరికీ లేదు. వరసకు చంద్రబాబు నాకు అన్న అవుతారు. నా భార్య బంధువును తారకరత్న పెళ్లి చేసుకున్నారు. అలా అయితే చంద్రబాబు ఆస్తులన్నీ నావే అవుతాయా?’ అని విజయసాయి ప్రశ్నించారు. ఏదో ఒక రకంగా తనపై బురద జల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని,  ఇలాంటివి మానుకోవాల‌ని విజ‌య‌సాయిరెడ్డి హెచ్చరించారు.
YSRCP
Vijay Sai Reddy
Chandrababu
Nara Lokesh

More Telugu News