YSRCP: వైసీపీ నేత‌ల‌తో క‌లిసి ఫారిన్ టూర్‌కు ఎస్సై, డిప్యూటీ త‌హ‌సీల్దార్‌?... నిజ‌మైతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న ప్ర‌కాశం ఎస్పీ

prakasam district sp response on si and deputy tahasildar foriegn tour along with ysrcp leaders
  • ఫారిన్ టూర్‌లో ద‌ర్శికి చెందిన వైసీపీ నేత‌లు
  • వారి వెంట ఎస్సై, డిప్యూటీ త‌హ‌సీల్దార్‌లు వెళ్లార‌ని ప్ర‌చారం
  • ప్ర‌చారంపై స్పందించిన జిల్లా ఎస్సీ మలిక్ గార్గ్‌
ప్ర‌కాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న వైసీపీ నేత బాలినేని శ్రీనివాస‌రెడ్డి అప్పుడెప్పుడో ప్రైవేట్ జెట్‌లో విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి వివాదం కొని తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అలాంటి వివాద‌మే మ‌రొక‌టి అదే జిల్లాలో ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. జిల్లాలోని ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కొంద‌రు వైసీపీ నేత‌లు ప్ర‌స్తుతం ఫారిన్ టూర్‌లో ఉన్నార‌ని, వారి వెంట ద‌ర్శి ఎస్సై చంద్ర‌శేఖర్‌, డిప్యూటీ త‌హ‌సీల్దార్ ర‌వి శంక‌ర్‌లు కూడా వెళ్లార‌ని ప్ర‌చారం సాగుతోంది.

ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌కాశం జిల్లా ఎస్పీ మ‌లిక్ గార్గ్ తాజాగా స్పందించారు. వైసీపీ నేత‌ల వెంట ద‌ర్శి ఎస్సై, డిప్యూటీ త‌హ‌సీల్దార్ ఫారిన్ టూర్ వెళ్లార‌న్న విష‌యంపై ఇప్ప‌టికే ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని ఎస్పీ తెలిపారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌భుత్వ అధికారులు స‌ర్కారీ అనుమ‌తి లేకుండా ఫారిన్ టూర్ వెళ్ల‌డానికి వీల్లేద‌ని వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో ఫారిన్ టూర్‌కు ఎస్సై, డిప్యూటీ త‌హ‌సీల్దార్‌లు వెళ్లిన‌ట్లు తేలితే వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఎస్సీ తెలిపారు.
YSRCP
Prakasam District
Darsi
Prakasam District SP

More Telugu News