Ripudaman Singh Malik: 'కనిష్క' ఎయిరిండియా విమానం పేల్చివేత కేసు నిందితుడు రిపుదమన్ సింగ్ కాల్చివేత

Ripudaman Singh Malik 1985 Air India bombing accused shot dead in Canada
  • ఎయిరిండియా విమానం కనిష్క పేల్చివేత ఘటనలో నిందితుడు
  • 2005లో నిర్దోషిగా విడుదల
  • ఇటీవల ఏపీ సహా పలు ప్రాంతాల్లో తీర్థయాత్రలు
  • కెనడాలో దుండుగుల కాల్పుల్లో అక్కడికక్కడే మృత్యువాత
1985 ఎయిరిండియా విమానం కనిష్కను బాంబుతో పేల్చేసిన కేసులో నిర్దోషిగా విడుదలైన రిపుదమన్ సింగ్ మాలిక్ (75) నిన్న ఉదయం కెనడాలో హత్యకు గురయ్యాడు. బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపినట్టు స్థానిక మీడియా పేర్కొంది. 

సింగ్ మెడ నుంచి బుల్లెట్లు దూసుకుపోయాయి. మూడుసార్లు కాల్పులు జరిపినట్టు తనకు శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, తీవ్రంగా గాయపడిన రిపుదమన్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. చూస్తుంటే ఇది ఆయనను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలానే ఉందని పేర్కొన్నారు. 

ఎయిర్ ఇండియా విమానం 182 ఎంపరర్ కనిష్క 23 జూన్ 1985లో 329 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి మాంట్రియల్‌కు బయలుదేరింది. అట్లాంటిక్ సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో బాంబు పేలడంతో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. 

ఈ కేసులో రిపుదమన్ సింగ్ మాలిక్, ఇందర్‌జీత్ సింగ్ రేయాత్, అజైబ్ సింగ్ బగ్రిలు ప్రధాన నిందితులు. ఈ కేసు నుంచి 2005లో మాలిక్ నిర్దోషిగా విడుదలయ్యాడు. ఆ తర్వాత అతడి పేరును బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించిన తర్వాత 2019లో భారతదేశాన్ని సందర్శించాడు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్రలో తీర్థయాత్రలు చేసినట్టు ఇండియన్ వరల్డ్ ఫోరమ్ ప్రెసిడెంట్ పునీత్ సింగ్ చందోక్ తెలిపారు. 

రిపుదమన్ సింగ్ హత్యపై శిరోమణి అకాలీదళ్ ఢిల్లీ అధ్యక్షుడు, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ (DSGMC) మాజీ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ సర్నా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ హత్యపై కెనడా అధికారులు సమగ్ర దర్యాప్తును ప్రారంభించి దోషులను శిక్షిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
Ripudaman Singh Malik
Air india
Kanishka flight
Canada

More Telugu News